జూలూరుపాడు, మార్చి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామ సమీపంలో ఉన్న పాలగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ రుక్మిణి సహిత సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా కన్నుల పండువగా భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ప్రకృతి ఒడిలో స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రంలో గోపాలుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తంగా హోమాలు – పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం యాగశాలలో చతుస్థానార్చనలు, నిత్యపూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ హోమ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

కాకర్ల పాలగుట్టపై వైభవంగా ‘వేణుగోపాల స్వామి’ బ్రహ్మోత్సవాలు
అనంతరం నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ రుక్మిణి సహిత సంతాన వేణుగోపాల స్వామి వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. మంగళ వాయిద్యాలు, భక్తజన జయజయధ్వానాల మధ్య స్వామివారి కల్యాణాన్ని అర్చకులు వేదోక్తంగా జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12:00 గంటల నుండి భక్తులందరికీ భారీ స్థాయిలో అన్న సమారాధన నిర్వహించారు.

కాకర్ల పాలగుట్టపై వైభవంగా ‘వేణుగోపాల స్వామి’ బ్రహ్మోత్సవాలు
ఆలయ కమిటీ చైర్మన్, శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. పాలగుట్టపై వెలసిన స్వామివారిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలతో కాకర్ల గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఢిల్లి వెంకటేశ్వర్లు, శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.