DRDO | దేశీయ రక్షణ సాంకేతికతలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. భారతక్ష రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) యుద్ధవిమాన పైలట్ ఎస్కేప్ సిస్టమ్‌కు సంబంధించిన హై-స్పీడ్ రాకెట్-స్లెడ్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని మంగళవారం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ పరీక్ష స్వదేశీ యుద్ధవిమాన రక్షణ సాంకేతికతలో ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’ పోస్ట్‌లో టెస్ట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.
ఈ టెస్ట్ చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL)లో ఉన్న రైల్-ట్రాక్ రాకెట్ స్లెడ్ ఫెసిలిటీలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో నిర్వహించింది. ఈ విజయంతో పైలట్ ఎజెక్షన్ సిస్టమ్‌ను పూర్తిగా పరీక్షించగలిగే సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ ఎస్కేప్ సిస్టమ్‌ను నియంత్రిత వేగంతో పరీక్షించారు. కానోపీ సెవెరెన్స్ (canopy severance), ఎజెక్షన్ సీక్వెన్స్, ఎయిర్‌క్రూ రికవరీ ప్రక్రియ వంటి అన్ని దశలు విజయవంతమయయాయి. ఈ టెస్ట్‌ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంయుక్తంగా నిర్వహించాయి. డైనమిక్ ఎజెక్షన్ టెస్టులు చాలా క్లిష్టమైనవి, స్టాటిక్ పరీక్షలకంటే నమ్మదగినవి.
ఈ పరీక్షలో ఎల్సీఏ యుద్ధవిమానం ముందు భాగాన్ని ప్రత్యేకంగా రూపొందించిన డ్యూయల్ స్లెడ్కు అమర్చి, పలు రాకెట్ మోటార్స్‌ని దశలవారీ ఇగ్నిషన్ ద్వారా నియంత్రిత వేగంతో ముందుకు దూసుకెళ్లేలా చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన మానవాకార డమ్మీ సహాయంతో పైలట్‌కు వచ్చే లోడ్స్, మోమెంట్లు, యాక్సిలరేషన్ వంటి కీలక డేటాను నమోదు చేశారు. మొత్తం పరీక్షను హై-స్పీడ్ కెమెరాలతో రికార్డ్ చేశారు. ఈ పరీక్షను భారత వాయుసేన (IAF), వైమానిక వైద్య, ధ్రువీకరణ సంస్థల అధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయంపై డీఆర్డీవో, ఐఏఎఫ్, ఏడీఏ, హెచ్ఏఎల్తో పాటు రక్షణ రంగ సంస్థలను అభినందించారు. స్వదేశీ రక్షణ సాంకేతికను బలోపేతం చేయడంలో ముందడుగని పేర్కొన్నారు.