Jagadish Reddy | కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పది రోజుల తర్వాత స్పందించిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరని విమర్శించారు. కొందరు వాటర్లో నీళ్లు కలుపుకుని స్పృహ కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు. మరికొందరు కమిషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉన్నారని అన్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పది రోజులకు స్పందించడం హాస్యాస్పదమని జగదీశ్ రెడ్డి అన్నారు. ఒక ప్రాంతం, ఒక మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే వాటిని ఉపసంహరించుకోవాలని సూచించారు. ఉద్యమ సమయంలో తామెప్పుడూ ప్రాంతాలను దూషించలేదని తెలిపారు. అన్నదమ్ములుగా విడిపోయి వేర్వేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ ఆనాడే చెప్పారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ నీడలో హైదరాబాద్లో ప్రశాంతంగా ఉన్నామని ఏపీ ప్రజలే చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవుపలికారు.
పవన్ కల్యాణ్ సినిమాలను ఆపుతామని ఇక్కడి మంత్రి కామెడీగా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డిని ఉద్దేశించి జగదీశ్ రెడ్డి విమర్శించారు. వాస్తవానికి అభిమానం వేరు.. రాజకీయం వేరు అని చెప్పారు. తమ అభిమాన హీరోగా ఎవరి సినిమాలనైనా ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. పది రోజుల తర్వాత కాంగ్రెస్ మంత్రులు స్పందించిన తీరు ఇద్దరిలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టుందని విమర్శించారు. కండ్ల ముందు కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే అప్పుడూ అలసత్వమే అని మండిపడ్డారు. వాటర్ నీళ్లు, కమిషన్లపై పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెడితే మంచిదని సూచించారు.