విజయ దశమి అందరికీ పండుగే! ఆ దర్జీ ఇంట ప్రతీ దసరా ప్రత్యేకమే. యుగాల కిందట అసురశక్తిపై అమ్మ సాధించిన విజయానికి ప్రతీకగా మనమంతా దసరా జరుపుకొంటాం! కానీ, ఆదిశక్తి అంశగా భావించే ఆడపిల్లలు సాధిస్తున్న వరుస విజయాలకు ఆ లోగిలిలో దసరా మరింత సరదాగా జరుగుతుంటుంది!! వాళ్లది సాధారణమైన గెలుపు కాదు! ఒకే పేగు పంచుకుపుట్టిన నలుగురు అక్కచెల్లెండ్లు ఎంబీబీఎస్ సీట్లు పొంది అసాధారణ మజిలీ అందుకున్నారు. విజయమంటే ఇదీ అంటున్నారు. తమ ఇంట్లో అర్ధంతరంగా తనువు చాలించిన పెద్దలకు నివాళిగా పట్టుపట్టి, ఎంబీబీఎస్ సీట్లు కొట్టారు. వారి గెలుపు.. ఎందరి ప్రాణాలనో నిలబెడుతుంది. మరెందరికో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. సిద్దిపేట గడ్డకు చెందిన ఈ చదువుల తల్లుల విజయగాథ ఎందరికో ఆదర్శం.
నలుగురు బిడ్డల్లో ఒకరు డాక్టర్ అయితేనే ఆ తల్లిదండ్రులు సగర్వంగా తలెత్తుకుంటారు. ఇద్దరు వైద్యులు అయితే.. వారి ఆనందానికి అవధులు ఉండవు. తాము జన్మనిచ్చిన నలుగురు బిడ్డలూ తెల్లకోటు వేసుకుని కండ్లముందుకు వస్తున్నారంటే.. ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. సిద్దిపేట జిల్లా నర్సపురానికి చెందిన కొంక రాంచంద్రం (శేఖర్), శారద దంపతుల.. పుత్రికోత్సాహం ఇప్పుడు నాలుగింతలు అయింది. తొలిచూలు ఆడపిల్ల.. అందరికీ హ్యాపీ! రెండో కాన్పు.. ఆడకూతురు, అయినా హ్యాపీ!! మూడో కాన్పు.. కవలలు. కలువల్లాంటి ఇద్దరు ఆడపిల్లలు.. ఇంకా హ్యాపీ!! ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవ్! ముగ్గురమ్మలు, మూలపుటమ్మ తన ఇంట నలుగురు అమ్మాయిల రూపంలో అవతరించిందని పొంగిపోయాడు. ఆ బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి మనసు కూడా అంతే ఉప్పొంగింది. ఆ బిడ్డలను ఉన్నతంగా చదివించాలని బలంగా అనుకున్నారు ఇద్దరు. వాళ్ల కలలు సాకారం అయ్యాయి. ఆరేండ్ల కిందట పెద్దబిడ్డ ఎంబీబీఎస్ సీటు కొట్టింది. నాలుగేండ్ల కిందట రెండో బిడ్డ వైద్య విద్యలో ర్యాంకు సాధించింది. ఇప్పుడు చిన్నబిడ్డలు ఇద్దరూ అక్కల బాటలోనే ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. నలుగురినీ వైద్య విద్య చదివించడం ఎందుకు? అంటే.. దాని వెనుక పెద్ద కథ ఉంది!
కొంక రాంచంద్రం కుటుంబం నిరుపేద కుటుంబం. పదిహేనో ఏటే తల్లిని కోల్పోయాడు. గొంతు క్యాన్సర్ కారణంగా ఆమె నడివయసులోనే తనువు చాలించింది. రాంచంద్రం అన్నకు ఫిట్స్ వచ్చేది. ఓ రోజు తీవ్ర జ్వరం వచ్చింది. సిద్దిపేట దవాఖానకు తీసుకెళ్లారు. సాయంత్రం దాకా చికిత్స అందించిన వైద్యులు ‘లాభం లేదు పట్నానికి తీసుకెళ్లమ’ని చెప్పారు. హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూశారు. తర్వాత కొన్నాళ్లకు రాంచంద్రం తండ్రి పక్షవాతంతో కన్నుమూశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు అర్ధంతరంగా తనువు చాలించారు. చదువుకోవాలని ఎంత ఆరాటం ఉన్నా.. కుటుంబ పరిస్థితుల కారణంగా రాంచంద్రం పదో తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించాడు. కుట్టుపని నేర్చుకొని దర్జీగా స్థిరపడ్డాడు. అయితే, తమ కుటుంబంలో వరుస మరణాలకు కారణం సరైన వైద్యం అందకపోవడమే అనే భావన అతనిలో గూడుకట్టుకుంది. కొన్నాళ్లకు రాంచంద్రం వివాహం శారదతో జరిగింది. వారికి పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఆమెకు మమత అని పేరు పెట్టుకున్నారు. బిడ్డను డాక్టర్‌ను చేయాలని ఆమె పుట్టినప్పుడే అనుకున్నాడు రాంచంద్రం. తర్వాత మాధురి జన్మించింది. కొన్నాళ్లకు కవలలు రోహిణి, రోషిణి జన్మించారు. పెద్దబిడ్డకు జరిగిన కథంతా చెప్పి ‘నువ్వు డాక్టర్ కావాలమ్మా!’ అని చెబుతుండే వాడు రాంచంద్రం. ఆ మాటలు మమతతోపాటు మిగతా బిడ్డలూ వింటుండేవారు. ‘మేమూ డాక్టర్లం అయితాం నాన్నా!’ అనేవారు. ఆ మాటలకు ఆ తండ్రి కండ్లు చెమ్మగిల్లేవి. తల్లి మాత్రం డాక్టర్ చదివించడం అంటే మాటలా అనుకునేది!
అమ్మానాన్నల ఆశయాలను నెరవేర్చాలనే తపనతో మమత కష్టపడి చదివేది. అక్కను చూస్తూ చెల్లెండ్లూ చక్కగా చదివేవారు. తండ్రి మాట నిలబెట్టాలనే సంకల్పంతో మమత అహరహం శ్రమించేది. “సరైన వైద్యం అందక మన కుటుంబం ఎంతో నష్టపోయింది. మన కష్టం ఎవరికీ రావొద్దంటే.. మన కుటుంబంలో నుంచి డాక్టర్లు రావాలి’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. మాటలకే పరిమితం కాలేదు నాన్న. ఎన్ని కష్టాలు ఎదురైనా మా చదువులకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. మొదట్లో అందరం తెలుగు మీడియంలో చదివాం. ఒకేసారి ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలోకి మారే సరికి కొంత ఇబ్బంది అయింది. ‘ఏం కాదు.. మనం చదవాలి.. మరికొందరికి స్ఫూర్తినివ్వాలి’ అని వెన్ను తట్టి మమ్మల్ని నాన్న ముందుకు నడిపించారు. అలా 2018లో ఎంబీబీఎస్ సీటు సాధించాను. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో కన్వీనర్ కోటాలో వైద్యవిద్యలో చేరాను. 2024లో నా ఎంబీబీఎస్ పూర్తయింది. ప్రస్తుతం పీజీ కోసం ప్రిపేర్ అవుతున్నాను. మా నాన్న ఆశయానికి నాంది నేను అయ్యాను. నన్ను చూసి మా చెల్లెండ్లు కూడా ఎంబీబీఎస్ సీటు సాధించడం గర్వంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది మమత.
అక్క నడిచిన బాటలోనే ముగ్గురు చెల్లెండ్లూ నడిచారు. ఆమె స్ఫూర్తితో పట్టుదలగా చదివారు. ‘అమ్మానాన్నల కష్టం చూస్తూ పెరిగాం. ‘ఆడపిల్లలను ఇంతగా చదివించడం అవసరమా!’ అని చాలామంది నాన్నను అంటుండేవారు. ‘నా బిడ్డలు చదువుల తల్లులు’ అని సమాధానం ఇచ్చేవారు నాన్న. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా… మాకు ఏ లోటూ రానివ్వలేదు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు సిద్దిపేటలోని శ్రీసాయి విద్యాలయం (తెలుగు మీడియం), సిద్ధార్థ పాఠశాలలో తొమ్మిది, పది చదివాను. ఇంటర్ హైదరాబాద్‌లో చేశాను. 2020లో ఎంబీబీఎస్ సీటు సాధించి కరీంనగర్ చెల్మెడ ఆనందరావు కళాశాలలో వైద్య విద్యలో చేరాను. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. మా అక్కకు ఎంబీబీఎస్ సీటు వచ్చినప్పుడే నాకూ వచ్చేది. కానీ కొంచెం అనారోగ్యం కారణంగా నాన్న ఇంటికి తీసుకువచ్చారు. నాకు ఆరోగ్యం బాగలేకపోవడంతో కుంగుబాటుకు గురయ్యా. రెండేండ్లు ఇంటి దగ్గరే ఉండి చదువుకున్నా. ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నా. దీంతోపాటు యూట్యూబ్ పాఠాలు వింటూ ప్రిపేర్ అయ్యాను. మొత్తంగా 2020లో ఎంబీబీఎస్ సీటు సాధించాను’ అని తన విజయగాథను పంచుకుంది మాధురి.
అక్కలు ఇద్దరూ ఎంబీబీఎస్ సాధించడంతో ఈ కవల చెల్లెండ్లలో పట్టుదల మరింత పెరిగింది. అక్కల బాటలోనే నడిచి తామూ డాక్టర్లు కావాలని ఫిక్సయ్యారు. అదే పట్టుదలతో జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు కొట్టారు. మమతకు ఎంబీబీఎస్ కోచింగ్ ఇచ్చిన వాళ్లు రోహిణి, రోషిణికి హాస్టల్ ఫీజు కట్టుకొని విజయవాడలోని ఇంటర్ సీటు ఇచ్చారు. ఇద్దరూ కలిసి నీట్‌కు ప్రిపేర్ అయ్యారు. ఇద్దరిలో ఒకరికి ప్రైవేట్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. మరొకరికి సీటు రాలేదు. ‘మా పెద్దక్కకు ఎంబీబీఎస్ సీటు వచ్చి, రెండో అక్కకు రానప్పుడు తను డిప్రెషన్‌కు గురైంది. అందుకే, చెల్లి (రోషిణి)కి సీటు రాకపోవడంతో.. వచ్చిన సీటును వదులుకున్నా! పైగా ప్రైవేట్ కాలేజీలో చేరి నాన్నకు భారం కావొద్దు అనుకున్నా’ అని చెబుతుంది రోహిణి. మళ్లీ ఇద్దరూ కష్టపడి ఈ ఏడాది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించారు. 2024లో ఇద్దరూ జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. తండ్రి తపన తెలిసిన నలుగురు అక్కాచెల్లెండ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించి.. సూపర్ సిస్టర్స్ అనిపించుకున్నారు.
మాకు నలుగురు అమ్మాయిలే అని ఎన్నడూ బాధపడలేదు. నారు పోసిన వాడే నీరు పోస్తాడనే భారంతోనే ముందుకు పోతున్నాం. నిజాయతీగా బతికితే.. ఆ భగవంతుడే దారి చూపుతాడు. చాలాసార్లు మిత్రులు ఆర్థికంగా ఆదుకునేవారు. మళ్లీ వాళ్లకు తిరిగి ఇచ్చేస్తుంటాం. వారి సాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేం. ఇంటి మీద కూడా అప్పు తీసుకొని బిడ్డలను చదివిస్తున్నాం. మా గురించి తెలుసుకొని ఎమ్మెల్యే హరీశ్‌రావు సార్ మమ్మల్ని పిలిపించుకున్నారు. సార్ మాకు సాయం చేశారు. వారికి కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఆదుకుంటానని చెప్పారు. సార్‌కు మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.