Kasi Majili Kathalu Episode 42 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కుంభకోణ రాజ్యపు యువరాజు కందర్పుడు.. ఎగిరే జింక సాయంతో అనేక దేశాలు తిరిగేవాడు. అలా తిరుగుతున్నప్పుడే మనోరమతో రసరమ్యమైన ప్రేమకథ నడిపాడు. ఒక కొడుకును కూడా కన్నాడు. మహారాజైన తరువాత కూడా ఓసారి ఎగిరే జింకనెక్కి ఒక దేశానికి వెళ్లాడు. అక్కడ రత్నావతి అనే వేశ్యమాతకు బుద్ధి చెప్పడానికి విష్ణుమూర్తిగా అలంకరించుకుని, ఆమె కూతురైన విద్యావతి మందిరం వద్దకు వెళ్లాడు.
గదిలో విద్యావతి వీణ వాయిస్తున్నది. శ్రీకృష్ణుడి బొమ్మను ఎదురుగా పెట్టుకుని, శ్రోతలెవరూ లేకపోయినా.. దైవమే వింటున్నాడన్న భావనతో వీణావాదనను కొనసాగిస్తున్నది. తన గది కిటికీ సమీపంలో కందర్పుడు జింకపై ఎక్కి ఆకాశంలో ఎగురుతున్న సంగతి.. చాలాసేపటి వరకూ ఆమె గమనించలేదు. ఆమె ఏకాగ్రతను భంగపర్చేందుకు కందర్పుడు కొన్ని ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించలేదు.
వీణ పక్కనపెట్టి, కృష్ణుడికి మనసారా నమస్కరించి.. నిద్రకు ఉపక్రమించే సమయంలో యాథాలాపంగా కందర్పుణ్ని చూసింది విద్యావతి. తన కళ్లను తానే నమ్మలేక పోయింది. సాక్షాత్తూ విష్ణువులా వేషం ధరించి, గరుత్మంతునిలా అలంకరించిన జింకపై ఆకాశంలో ఎగురుతూ వచ్చిన కందర్పుణ్ని.. సామాన్య మానవుడని అనుకోలేక పోయింది. అనాలోచితంగా చేతులు రెండూ జోడించింది. ఎలాగో మాట పెగల్చుకుని..
“స్వామీ! ఎవరు మీరు?” అని అడిగింది.
“అతివా! నేను కందర్ప జనకుడిని” అని సమాధానమిచ్చాడు కందర్పుడు.
కందర్పుడంటే మన్మథుడు, ఆయన తండ్రి విష్ణుమూర్తి. అయితే వచ్చిన వాడు సాక్షాత్తూ విష్ణుమూర్తి అని విద్యావతి అర్థం చేసుకుంది.
“స్వామీ! నా జన్మ ధన్యమైంది!” అన్నది మోకాళ్లపై కూర్చుని, నుదురు నేలకు తాకిస్తూ.
“సౌభాగ్యవతీ! లోపలికి రావచ్చా?!” ప్రశ్నించాడు కందర్పుడు.. ఆశీర్వాదముద్రను పట్టి. విద్యావతికి పాపం నోటమాట రాలేదు. కందర్పుని మాయా గరుడ వాహనం నేరుగా విద్యావతి మందిరంలో వాలింది. కందర్పుడు కిందికి దిగాడు. విద్యావతి ఉచితాసనం చూపించింది.
ఒక పళ్లెం తెచ్చి అతని పాదాలు కడిగింది. పుష్పార్చన చేసింది. తన ఒళ్లు ఝల్లుమంటుంటే ఎలాగో సంబాళించుకుని, ఆయనకు గంధాన్ని సమర్పించింది. మెడలో పూలమాల వేసింది. పళ్లు, మధుర పదార్థాలు నైవేద్య మిచ్చింది. ఎప్పుడూ నైవేద్యాన్ని ప్రసాదంగా తాను తినడమే కానీ, ఆయనకు పెట్టిన వాటిని ఆయనే తృప్తిగా తినడం ఎన్నడూ చూడని వింత కాబట్టి.. అతను తినేదాకా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. దాహానికి పానీయాన్ని సమర్పించిన తరువాత.. ఒక పళ్లెంలో కర్పూర తాంబూలం అమర్చి అందించింది.
తాంబూలంతోపాటు విద్యావతి చేతిని కూడా అందుకున్నాడు కందర్పుడు. తన అంకపీఠంపై కూర్చోబెట్టుకున్నాడు. కలయో వైష్ణవమాయో తెలియని స్థితిలో విద్యావతి కన్నులు అరమోడ్చింది.
ఆమె చిబుకాన్ని ఎత్తి పట్టుకుని..
“తరుణీ! పూర్వజన్మలో నువ్వొక గోపికవు. కృష్ణావతార సమయంలో రాధతో సఖీభావాన్ని, నాపట్ల మధురభక్తి భావాన్ని ఒకే సమయంలో కలిగిఉన్న వారంతా గోలోకాన్ని చేరుకున్నారు. కానీ నువ్వు మాత్రం వారితోపాటు అక్కడిదాకా రాలేకపోయావు. అప్పటికీ నీలోని కామవాంఛ పూర్తిగా సద్దుమణగ లేదు. మరో జన్మలో నీకు ఆ కోరిక నెరవేరుస్తానని మాటిచ్చాను. అప్పుడిచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు వచ్చాను. భక్తుల కామితాలను నెరవేర్చడం కంటే మాకు వేరొక పనిలేదు కదా!” అంటూ.. ఆమెను మృదువుగా చుంబించాడు కందర్పుడు.
విద్యావతి పులకరింతల పూలచెట్టుగా మారింది. తనలోని భక్తి విశ్వాసాలను తేటతెల్లం చేస్తూ.. ఆ రాత్రిని కందర్పునికి అంకితం చేసి, మగతలో కూరుకుపోయింది. తెల్లావారుతూనే కందర్పుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఆనాటి నుంచి ప్రతిరాత్రి ఆమెకోసం అతను వస్తూనే ఉన్నాడు. తన రాకను ఎవరికీ చెప్పవద్దని శాసించాడు. విద్యావతి ఆ శాసనాన్ని తు.చ. తప్పకుండా పాటించింది. అందువల్ల వారిద్దరి కలయిక గురించి మూడోకంటి వాడికి కూడా తెలియలేదు. విద్యావతి ప్రతి రాత్రీ తన మందిరాన్ని శోభాయమానంగా అలంకరిస్తూనే ఉంది. యథాశక్తి తన భక్తిప్రపత్తులతో కందర్పుణ్ని మెప్పిస్తూనే ఉంది.
విద్యావతి ఆ కులంలో తప్పు పుట్టింది. ఊహ తెలిసిన నాటినుంచి సంగీత, శాస్ర్తాలను అభ్యసించడంలోనే నిరంతరం తలమునకలుగా ఉండేది. తల్లి రత్నావతి ఎంతోమంది విటులను ఆకర్షించి, విద్యావతితో కూర్చాలని తాపత్రయ పడుతుండేది. కానీ, విద్యావతి ఎన్నడూ తల్లిమాటలను లక్ష్యపెట్టలేదు. తల్లి తీసుకువచ్చే మగవాళ్లను కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడేది కాదు.
తన జన్మను కృష్ణుడికే అంకితం చేయాలని ఎప్పుడో నిర్ణయించుకుంది. మారువేషాన్ని ధరించి కందర్పుడు దర్శనమిచ్చే వరకు తన తన ప్రేమను కాపాడుకుంటూ వచ్చింది. అతను మాయారూపుడని ఆమెకు తెలియదు. కాబట్టి, ఆమెకు సంబంధించినంత వరకు అతను కృష్ణుడే!
ఆమె స్వచ్ఛమైన ప్రేమను చూరగొన్నందు వల్ల కాబోలు.. రోజులు గడిచే కొద్దీ కందర్పుడు తెలియకుండానే విద్యావతి మోహంలో పడ్డాడు.
మదన భావాలను ప్రేరేపించే ఆకస్మికపు నవ్వు చేత.. మనసుకు కలిగే సంకోచ రూపమైన లజ్జచేత.. కారణం తెలియకుండా హఠాత్తుగా కలిగే భయం చేత.. క్రీగంటి చూపుల చేత.. మధురమైన మాటల చేత.. ప్రణయ కలహాల చేత.. జడ విసురుల చేత.. విభ్రమ కలగచేసి జితేంద్రియులకు కూడా కాంతలు మోహాన్ని పుట్టించగలరు.
రత్నావతికి బుద్ధిచెప్పడానికి విద్యావతిని లొంగదీసుకోవాలని అనుకోవడం వరకే అతను బుద్ధిపూర్వకంగా చేసిన పని. ఆమెను చూసిన మరుక్షణం నుంచి అతని మనసు ఆమెకు అధీనమైపోవడం అతని ఎరుకలో లేదు.
అలా వాళ్లిద్దరూ ప్రతిరాత్రీ కలుసుకుంటూ, మధురానుభూతులు పంచుకుంటూ ఎన్ని సంవత్సరాలు గడిపారో తెలియదు. అన్ని సంవత్సరాలపాటు తన కూతురు ఒక్క దమ్మిడీ కూడా సంపాదించకుండా సోమరిగా గడిపేస్తుంటే రత్నావతి ఎందుకు ఊరుకుందో కూడా తెలియదు. బహుశా.. చెవిన ఇల్లు కట్టుకుని ఎంతగా పోరుపెట్టినా తన కూతురు మారదని, నిరాశ చేసుకుని ఉండవచ్చు.
ఏదేమైనా.. కందర్పుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టి, విద్యావతి మోహంలో పడి చాలా సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ సంగతి కందర్పునికి గుర్తు లేదు. తన రాజ్యాన్ని, మనోరమను, సుభద్రను ఎలా మరిచిపోయాడో చెప్పలేం! ఆఖరికి అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కూడా అన్నేళ్ల కాలంలో ఒక్కసారి కూడా అతనికి జ్ఞాపకం రాకపోవడం విచిత్రమే మరి.
ఇంటిగుట్టు అందరికంటే ఆలస్యంగా ఇంటిపెద్దకు తెలుస్తుందంటారు. అలాగే చాలాకాలం తర్వాత ఒకనాడు విద్యావతి, కందర్పుడు ఏకాంతంలో ఉండగా రత్నావతి చూసింది.
“లక్షాధికారులను ఛీ పొమ్మన్నావు. కోటీశ్వరులను తీసుకొస్తే కాలదన్నావు. ఇప్పుడు చూస్తే ఈ అనామకుడికి ఊడిగం చేస్తున్నావా? నీ బతుకు పాడుగాను” అని కూతురిమీద విరుచుకు పడింది.
“ఆయన ఎవరనుకున్నావు? సాక్షాత్తూ దేవదేవుడు” అని విద్యావతి జరిగిందంతా తల్లికి చెప్పింది.
కూతురు చెప్పిందంతా విన్న తరువాత రత్నావతిలో అకస్మాత్తుగా భక్తి పెరిగిపోయింది. కందర్పుని ముందు మోకరిల్లి.. “స్వామీ! నిన్ను కళ్లారా చూసిన తరువాత.. ఈ పాపిష్టి లోకంలో బతకలేను. దయచేసి మమ్మల్ని కూడా నీతోపాటు నీ లోకానికి తీసుకుపో” అని కోరింది.
కందర్పుడు ఆమెకు ఆశీర్వాదముద్రను చూపి..
“ఓసీ! నిన్ను తీసుకుపోవడానికి ఏమీ అభ్యంతరం లేదు. విద్యావతిని కన్నందుకైనా నీకు మోక్షమిచ్చి తీరాలి. కానీ, నువ్వు ఎంతోమందిని వంచించావు. బోలెడంత సంపద కూడబెట్టావు. ఒక్క తులం పుణ్యం కూడా సంపాదించుకోలేక పోయావు. కనక..” అని అర్ధోక్తిలో ఆపాడు.
“ఏమిటో సెలవివ్వండి స్వామీ! మీతోపాటు వైకుంఠానికి రావడం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే!” అన్నది రత్నావతి ఆదుర్దాగా. కందర్పుడు చిరునవ్వు కొనసాగిస్తూ.. “నీ దగ్గరున్న సంపదంతా దానధర్మాలు చేసెయ్యాలి. ఈ ఇల్లుతో సహా నీ పేరుమీద ఏమీ దాచుకోకూడదు. వచ్చే ఏకాదశి లోపు నువ్వీపని పూర్తి చేస్తే.. ఆనాడు వచ్చి నిన్ను, నీ కూతురిని నాతో పాటు తీసుకుపోతాను” అని బోధించాడు.
“దానికేం స్వామీ! అలాగే చేస్తాను. సాక్షాత్తూ వైకుంఠమే వచ్చి ఒళ్లో పడుతుంటే.. ఈ దండగమారి డబ్బు నేనేం చేసుకుంటాను?!” అన్నది రత్నావతి.
కందర్పుడు యథాప్రకారం జింకనెక్కి ఎగిరిపోయాడు.
మరునాడు తెల్లవారే లోపలే రత్నావతి ధారాళంగా దానధర్మాలు చేయబోతున్నదనే వార్త ఊరంతా వ్యాపించి పోయింది. దానాలు తీసుకునే బ్రాహ్మణులు ఒక వరుసలోనూ, ధర్మం పుచ్చుకునే బిచ్చగాళ్లు మరోపక్క రత్నావతి ఇంటిముందు బారులు తీరారు.
రత్నావతికి ఎన్ని ఆస్తులున్నాయో ఆమెకే తెలియదు. సంచులకొద్దీ వస్ర్తాలు, ఆభరణాలు పంచిపెట్టసాగింది. ఆ తరువాత స్థిరాస్తుల పంపిణీ మొదలైంది. వ్యవసాయ భూములు, నివేశన స్థలాలు కూడా దానం చేసింది. తాను ఉంటున్న ఇంటిని కూడా దానమిచ్చింది.
ఏకాదశి నాటి తెల్లవారేసరికి తాను, తన కూతురు వైకుంఠానికి వెళ్లిపోతున్నామని, ఆ తరువాత వచ్చి ఇల్లు సొంతం చేసుకోవచ్చని దానం తీసుకున్న బ్రాహ్మణుడితో చెప్పింది. ఆనాటి సాయంత్రమే గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకుని, సరుకు సంబారాలతో వచ్చేశాడు బ్రాహ్మణుడు. అతనితో వచ్చిన వాళ్లు రత్నావతిని, విద్యావతిని బలవంతంగా ఇంటినుంచి గెంటేశారు.
కందర్పుడు వస్తాడని, తమను వైకుంఠానికి ఎగరేసుకు పోతాడనుకుంటే.. ఎక్కడా అతని జాడే కనిపించలేదు. దాంతో ఏం చేయాలో తోచక ఊరిచివర మర్రిచెట్టు కింద తల్లీకూతుళ్లిద్దరూ తలదాచుకున్నారు. అంతటితో తాను కూడా బుద్ధి తెచ్చుకుని కందర్పుడు తన దారి తాను చూసుకుంటే బాగానే ఉండేది. కానీ, విద్యావతిని విడిచిపెట్టి వెళ్లిపోవడానికి అతనికి మనస్కరించలేదు.
రత్నావతి చెరువుకు వెళ్లిన సమయాన్ని కనిపెట్టి, విద్యావతిని కలుసుకున్నాడు. “సుగుణవతీ! ఒక భక్తురాలిని రక్షించే పనిలో పడి నీ మాట మరిచిపోయాను. కొద్దిగా ఆలస్యమైంది. వాహనం ఎక్కు. ఎగిరిపోదాం” అన్నాడు.
“ముందువైపు కూర్చోమంటారా.. వెనుకనా?!” అని అడిగింది విద్యావతి. ఆ మాటతో కందర్పుని కళ్లకు కప్పిన మాయపొర తొలగింది. ఒకప్పుడు మనోరమ కూడా ఇలాగే అడిగినట్లు అతనికి ఆ క్షణంలో జ్ఞాపకం వచ్చింది.
“హా మనోరమా! సుభద్రా! నాగదత్తా!” అంటూ విలపించ సాగాడు. అతని స్థితిని అర్థం చేసుకోలేక విద్యావతి తబ్బిబ్బు పడింది. కందర్పుడు అప్రయత్నంగా జింక కీలు తిప్పాడు. విద్యావతి హడావుడిగా అతని వెనుక కూర్చుంది. జింక ఆకాశంలోకి ఎగురుతుంటే రత్నావతి పరుగు పరుగున వచ్చింది.
“అమ్మాయీ! నన్ను ఒక్కదాన్నీ వదిలేసి వెళ్లిపోతావటే!” అంటూ జింక కాళ్లను పట్టుకుని లాగింది. ఆమె లాగిన వేగానికి జింక కాలు ఊడిపోయింది. గాలి పోయి, తోలుబొమ్మ తుస్సుమంది. విద్యావతి, కందర్పులిద్దరూ నేలమీద పడ్డారు.
“అయ్యో అయ్యో! ఎంత మోసం?!” అని రత్నావతి గుండెలు బాదుకుంది. కందర్పుణ్ని నానా తిట్లూ తిట్టింది.
“ఈ పనికిమాలిన వాడి మూలంగా నా ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాను. మాకు న్యాయం చేయండి మహాప్రభో!” అని కొత్తరాజు దగ్గర మొరపెట్టుకుంది.
“బంగారం లాంటి జింకబొమ్మ పాడైపోయింది. నాకే నష్టపరిహారం ఇప్పించాలి. మా రాజ్యానికి చేరుకునేందుకు సాయపడాలి” అన్నాడు కందర్పుడు.
“ఈ తోలుబొమ్మ మీకు ఎక్కడినుంచి వచ్చింది?” అడిగాడు కొత్తరాజు. అప్పుడు కందర్పుడు తన కథనంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అతను చెప్పినదంతా వింటూనే కొత్తరాజు సింహాసనం దిగి వచ్చాడు. “నాన్నగారూ! నేను మీ కుమారుణ్ని! నాగదత్తుణ్ని. ఇంతకాలం నుంచి మీరేమై పోయారో తెలియక, మిమ్మల్ని అన్వేషించడానికే.. జైత్రయాత్రలు చేస్తూ దేశాలన్నీ జయిస్తూ వస్తున్నాను. ఎట్టకేలకు మిమ్మల్ని కలుసుకోగలిగాను” అని నమస్కరించాడు.
కందర్పుడు అతణ్ని లేవనెత్తి.. “కుమారా! ఇంత అనుభవం ఉండి, అనేక శాస్ర్తాలను అభ్యసించి కూడా.. వేశ్యా వ్యామోహంలో పడిపోయాను. బాధ్యతలు మరిచి సుఖలాలసలో నా జీవితకాలమంతా వ్యర్థం చేసుకున్నాను. ఇలాంటి స్థితిలో నిన్ను కలుసుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు ఇంతటి సమర్థుడివి అయినందుకు గర్విస్తున్నాను” అన్నాడు. త్వరలోనే కందర్పుడు కుమారునితోపాటు తన రాజ్యానికి వెళ్లాడు. మనోరమకు, సుభద్రకు ఆనందం కలిగించాడు. ఆ తరువాత ఎగిరే జింకలు, కీలుగుర్రాల వంటి వింత కథలేవీ చరిత్రలో కనిపించలేదు.
(వచ్చేవారం.. నలుగురు రాకుమారులు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | ఎగిరే జింక-2
Kasi Majili Kathalu | ఎగిరే జింక
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు
Kasi Majili Kathalu | అనంగ చంద్రిక