Children Stories | ఒక ఊర్లె ఇద్దరు ఆలుమొగలు ఉండెటోళ్లు. ఆల్ల కులకశ్పి అడుక్కునుడు. ఈల్లు గూడ ఇల్లిల్లు దిరిగి అడుక్కునెటోళ్లు. దొరికింది దిని.. ఖుషీగ ఉండెటోళ్లు. ఒకపారి మొగడు అడుక్కోను వోతె.. ఒక ఆసామి తవ్వెడు జొన్నలు బిచ్చం ఏశిండు. అవి ఇంటికి దెచ్చి పెండ్లానికిచ్చి.. “ఏమే! రోజు అడుక్కున్నదే దింటాన్నం. రేపు పండుగ్గదా.. జొన్నరొట్టెలు జెయ్యి” అన్నడు. “అట్లనే!” అని జొన్నలు ఇసిరి రొట్టెలు జేశింది పెండ్లాం. తవ్వెడు జొన్నలు ఇసిరి జేత్తె.. మూడు రొట్టెలైనయి. అట్టిశాపల కూర అండుకొని కమ్మగ శెరో రొట్టె దిన్నరు.
మూడో రొట్టె కాడ ఇద్దరాలు మొగలకు కొట్లాటయ్యింది. నాకంటె.. నాకనుకుంట లొల్లి వెట్టుకున్నరు. “బిచ్చానికి వోయి నేనే జొన్నలు దెచ్చిన. ఆ రొట్టె నాకియ్యాలె” అన్నడు పెనిమిటి. “అయితె రెక్కలువోంగ ఇసిరి, పిండివట్టి శెయ్యిమీద రొట్టెజేశి, పెంకమీద గాల్శింది నేను.. నాదే రొట్టె” అన్నది పెండ్లాం. ముచ్చట ఎంతటికి తెగలే. ఇట్లగాదని ఇద్దరు అనుకొని.. ఒక షర్తు గట్టుకున్నరు. అదేందంటె.. ఇద్దరు కండ్లు మూస్కొని పండుకోవాలె. ఇద్దట్ల ఎవలు ముందుగాలె గదిలితే ఆల్లు ఓడిపోయినట్టు. ఇద్దరాలు మొగలు కండ్లు మూసుకుని పండుకున్నరు. రాత్రి గడిశింది. తెల్లారింది. పొద్దు నడినెత్తి మీదికచ్చింది. అయినా ఎవలూ కదులలే. మెదులలే.
‘ఎగిలివారంగ లేశి బిచ్చానికి వోయెటోల్లు గుడిశె తలుపులు తెరువక పాయె’ అని సుట్టుపక్కలోల్లకు అనుమానమచ్చి, దర్వాదలు వలగ్గొట్టిండ్లు. సూశెటాల్లకు ఇద్దరాలు మొగలు కదలకుంట పన్నరు. ఆల్ల పక్కపొంటి తిన్న తలెలు అట్లనే ఉండెటాలకు.. తిండిల ఎమన్న గలిశి సచ్చిపేయిండ్లు గావచ్చని అనుకున్నరు. ఆల్లే అనుకొని పాడెగట్టి ఇద్దరాలు మొగలను బొందలగడ్డకు మోస్కవోయిండ్లు. ఇదంత సూత్తున్నా.. ‘రొట్టె ఏడ వోతదో!’ అని ఎవలూ సప్పుడు జెయ్యలె. రెండు కాట్నాలు వేర్శిండ్లు. తొలుత పెండ్లాం కాటికి అగ్గి వెట్టిండ్లు. మంట సురుక్కు మనెటాలకు ‘అమ్మో’ అని ఒర్రుకుంట లేశికూసుంది. ఎన్కనే మొగడు లేశి.. “నేనే గెల్శిన.. నేనే గెల్శిన.. నేనే దింట.. నేనే దింట!” అనుకుంట కాడు మీదికెల్లి కిందికి దుంకిండు. సచ్చిపోయినోల్లు దయ్యాలయ్యిండ్లని, ఒగల్లనొకల్లు దింటాండ్లని.. అచ్చినోళ్లు అటొగలు ఇటొగలు ఉరికిండ్లు. ఎన్కశీరి కత ఎరుకయి ఇరుగ నవ్వుకున్నరు.
… పత్తిపాక మోహన్
మొగని అమాయకత్వం జూసి మోసం చేద్దామని జూసినోళ్లకు ఇకమాతులతో బుద్దిచెప్పిన పెండ్లం
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు