Children Stories | ఒక అడివిల ఒక మేక ఉంటుండె. అది దినాం గండంగ బతుకుతుండె. అడివి జంతువుల నుంచి తప్పిచ్చుకుని తిరుగుతుండె. ఒకసారి బాగ దూపయి అడివిల్నే ఉన్న ఒక కాలువ కాడికి వోయి.. ఆఖరుకు నిలుసొని నీళ్లు తాగవట్టింది. మేక కంటే కొద్దిగ ముంగట ఓ పెద్దపులి నీళ్లు తాగనీకి అచ్చింది. సోరసోర మేకను సూడంగనే దాని నోట్ల నీళ్లూరినయి. మేకను గెలుకుదామని.. “ఏందే! నేనంటే భయంలేదా! నా నీళ్లనే ఎంగిలి జేస్తున్నవ్!” అంట గట్టిగ గాండ్రించింది.
‘పొయ్యిపొయ్యి దీని కంట్ల వడ్డ!’ అని మిడుక్కుంటనే.. “నీ నీళ్లు నేనేడ ఎంగిలి జేస్తున్న. నువ్వు మీద దాగుతున్నవు. నేనే కింద తాగుతున్న! తొండి ఎందుకు వెడుతున్నవు!?”.. బుగులు బుగులుగనే అన్నది మేక. “ఇయ్యాల్ల గాదు.. నిన్న ఎంగిలి జేశినవు!” మల్ల అన్నది పులి. “వారం దినాలకెల్లి నేను ఈ జాగలకే రాలేదు. పక్క జంగల్ల పండుగకు వోయిన!” అంట జెప్పింది మేక. “అయితే.. మీ అవ్వ గావచ్చు మరి!” గద్దిచ్చుకుంట మల్ల అన్నది పులి. “మా అవ్వ యాడుంది!? ఎన్నడో నువ్వే ఆంబుక్క వెడితివి!” అంట కండ్లల్ల నీళ్లు దీసుకుంది మేక. “గట్లనా? నీ లెక్కనే గొట్టింది. మీ నాయిన గావచ్చు..” మల్ల అన్నది పులి. “మా నాయినెవలో నాకు తెల్వనే తెల్వది. నువ్వు అన్ని అవద్దాలాడుతున్నవ్!” అంట ఎన్కకు దిరిగి ఉర్కవోయింది. “ఎహే! మీ అవ్వనో.. అయ్యనో.. తాతనో.. ముత్తాతనో.. ఎవలైతేంది!? మొత్తానికి నా నీళ్లు ఎంగిలైనయి. గందుకే.. అందరికి బుద్ధచ్చేటట్టు నిన్ను ఆంబుక్క వెడ్త!” అంట మేక మీద ఎగిరి దుంకి, సుష్టుగ దిన్నది!
– పత్తిపాక మోహన్
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Children Stories | అయ్యో పాపం అని జాలి చూపిస్తే రాజుకే సుక్కలు చూపిచ్చిండు!
Children Stories | అన్ని తెలిసినోడు ఈ దునియాల ఎవ్వలుంటరు?
Children Stories | బీర్బల్తో మజాక్ చేయబోతే అక్బర్కే రివర్స్ తగిలింది!
Children Stories | మొగులు మీద సుక్కలకు.. ఆవాలకు మస్త్ లింకు పెట్టిన బీర్బల్!