Children Stories | ఎన్కట ఒక రాజు తాన ఒక మంత్రి ఉండెటోడు. ఆయినెకు ఎన్బై ఏండ్లు. అయినగుడ మస్తు ఉషారు! రాజుకు మంచిమంచి ముచ్చట్లు, రాజీర్కం జేసుట్ల ఇకమతులు.. సలాలూ ఇత్తుండె. రాజ్యం మంచిగ నడువవట్టింది. మంత్రికి శాతగాకుంట అయ్యెటాల్లకు, ఆయినె జాగల ఇంకొకల్లను పెట్టుకోవాలని రాజు అనుకున్నడు. మంత్రి నౌకరి కోసం వేలాన్ ఏసిండ్రు. దేశం మూలమూలకెల్లి మాలెస్క మంది సదువుకున్నోల్లు, తెలివైనోల్లు అచ్చిండ్రు. అన్ని పరీచ్చలు పెట్టంగ పెట్టంగ.. ఇద్దరు బాగ సదువుకున్న సొరసొర పిలగాండ్లు అన్నిట్ల గెలిశి, నిలిశిండ్రు.
ఆ ఇద్దరికెల్లి ఒకల్లను మంత్రిని జేసుడు బాకి. ముసలి మంత్రి ఆఖరుకు ఇద్దరిని సబలకు పిలిపిచ్చిండు. సబల అందరున్నరు. ‘మంత్రి ఎట్ల జేత్తడా!?’ అంట సూడ వట్టిండ్రు. “మనం మంత్రి కోసం పెట్టిన అన్ని పరీచ్చలల్ల ఈల్లిద్దరు సమానంగ అచ్చిండ్రు. అయినా కొన్నికొన్ని ఈల్లకు తెల్వదు అనుకుంటున్న. ఇగో.. మీ ఇద్దరిట్ల అన్ని తెలిసినోళ్లు వొయ్యి.. ఆ మంత్రి కుర్సీల కూసోండి!” అంట జెప్పిండు. ఆయినె అనుడాల్శం లేదు.. ఒకడు శనంల వోయి కుర్సీల గూసున్నడు. మంత్రి రెండోన్ని రాజుకాడికి తోలుకవోయి.. “అన్ని తెలిసినోడు ఈ దునియాల ఎవ్వలుండరు. గన్క ఈనెనే పనికత్తడు!” అంట జెప్పంగనే.. అందరు సప్పట్లు గొట్టిండ్రు. రెండోనికి గూడ మంచి కొలువు ఇచ్చిండ్రు.
-పత్తిపాక మోహన్