Kurukshetra | సీనియర్ లాయర్ ఇంట్లోకి(Senior lawyer house) చొరబడిన దొంగలు భారీ దోపిడీకి(Robbery) పాల్పడ్డారు. సుమారు రూ. 3.15 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పారిపోయారు. ఈ సంఘటన హరియాణాలోని కురుక్షేత్ర(Kurukshetra | )పరిధిలోని ఓ సీనియర్ న్యాయవాది ఇంట్లో గురువారం చోటు చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సదరు లాయర్ ఇల్లే లక్ష్యంగా దొంగలు రెండోసారి చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ న్యాయవాది బల్వంత్ సింగ్ వాలియా రాత్రి తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు.
ఆయన రాత్రి 10 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి బెడ్‌పై పడేసారు. బల్వంత్ సింన్ను సైతం తాళ్లతో కట్టేసి తుపాకితో బెదిరించి రూ.3.15 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు లైసెన్స్ కలిగిన రివాల్వర్‌ను ఎత్తుకెళ్లారు. దుండగులు వెళ్లే ముందు ఆధారాలు లభించకుండా నాలుగు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. మళ్లీ వస్తామని, మరో రూ. 80 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పోలీసులకు చెబితే దంపతులను చంపేస్తామని బెదిరించారని వాలియా ఆరోపించారు.
నిందితులు పారిపోయే ముందు ఇంటికి తాళం వేశారు. వృద్ధ దంపతులు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని విడిపించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఈ ఏడాది మార్చి 20న అదే ఇంట్లో జరిగిన రూ. 50 లక్షల దొంగతనం వెనుక తామే ఉన్నామని దొంగలు ఆ దంపతులకు చెప్పినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు థానేసర్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (CIA) బృందాలు రంగంలోకి దిగి, నగరం నలుమూలలా ఉన్న ఇతర సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాయి.
మరోవైపు ఈ ఘటనపై హర్యానా మాజీ మంత్రి, కాంగ్రెస్ థానేసర్ ఎమ్మెల్యే అశోక్ అరోరా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయన్నారు. ఒకప్పుడు హర్యానాలోని అత్యంత శాంతియుత నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన కురుక్షేత్రలో ఇప్పుడు తరచుగా తీవ్రమైన నేరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలను పట్టుకొని శాంతిభద్రతలు కాపాడాలని డిమాండ్ చేశారు.