IND vs ZIM : జింబాబ్వే పర్యటనను భారత జట్టు (Team India) ఓటమితో మొదలెట్టింది. హారారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన తొలి టీ20లో టీమిండియా చెత్త ఆటతో చిత్తుగా ఓడింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై తెండాయ్ చతర(3/16), కెప్టెన్ సికిందర్ రజా (3/25), లు విజృంభించడంతో శుభ్‌మన్ గిల్ సేన 102కే ఆలౌటయ్యింది. దాంతో, భారత జట్టుపై టీ20ల్లో అత్యల్ప స్కోర్‌ను కాపాడుకున్న జట్టుగా జింబాబ్వే చరిత్ర సృష్టించింది. ఇంతకముందు ఆ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. కివీస్ 2016లో టీమిండియాపై 126 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది.
సీనియర్ల గైర్హాజరీలో జింబాబ్వే విమానమెక్కిన యువ భారత జట్టుకు ఆతిథ్య దేశం భారీ షాకిచ్చింది. తొలి టీ20లో జింబాబ్వే బౌలర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయగా.. శుభ్‌మన్ గిల్(31), చివర్లో వాషింగ్టన్ సుందర్ (27) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఓవర్ వరకూ నిలబడిన సుందర్ ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ విజయంతో ఆతిథ్య జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
కొట్టింది చిన్న స్కోరే అయినా ఆల్‌రౌండ్ షోతో శుభ్‌మన్ గిల్ సేనను జింబాబ్వే అలవోకగా
ఓడించింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ(0), రియాన్ పరాగ్(2), ధ్రువ్ జురెల్(6)లు దారుణంగా విఫలమవ్వగా.. గిల్(31)కు సహకరించేవారే కరువయ్యారు. సికిందర్ బౌలింగ్‌లో గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాక.. ఓటమి ఖాయమైన దశలో అవేశ్ ఖాన్(16), వాషింగ్టన్ సుందర్(27)లు బౌండరీలతో చెలరేగి ఆశలు రేపారు. అయితే.. చివరి ఓవర్లో పరుగులు అవసరం కాగా.. కేవలం రన్స్ వచ్చాయంతే. దాంతో, ఆతిథ్య జట్టు 13 పరుగులతో సూపర్ విక్టరీ సాధించింది.
Fantastic performance by Zimbabwe in the first T20I against India 👏#ZIMvIND | 📝: https://t.co/fo9Ow4hvG9 pic.twitter.com/s4TCUfdYSL
— ICC (@ICC) July 6, 2024
తొలుత యువ భారత్ జింబాబ్వేను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్(4/13) తన మ్యాజిక్ చూపించగా ఆతిథ్య జట్టు 115 పరుగులకే పరిమితమైంది. రెండో ఓవర్ నుంచే తడబడిని జింబాబ్వే టాపార్డర్‌ను బిష్ణోయ్ డగౌట్ పంపి ఒత్తిడిలోకి నెట్టాడు.
క్లైవ్ మడందే(29 నాటౌట్)
ఇక వాషింగ్టన్ సుందర్ సైతం ఓ చేయి వేయడంతో ప్రధాన ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. ఒకదశలో 90 పరుగులకే ఆలౌట్ అంచున నిలిచిన జట్టును క్లైవ్ మడందే(29 నాటౌట్) ఆదుకున్నాడు. ఆఖరి ఓవర్లలో మెరుపు బ్యాటింగ్‌తో జింబాబ్వేకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.