హయత్‌నగర్, డిసెంబర్ 23 : హయత్‌నగర్‌లోని విజయవాడ జాతీయ రహదారిపై ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు తక్షణమే నిర్మించాలని పలు కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు దాపురించాయని వాపోయారు. భాగ్యలత కాలనీ నుంచి హయత్‌నగర్ వరకు ఎక్కడా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడంతో రోడ్డును దాటే సమయంలో అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారుతున్నారన్నారు.
ఇటీవల రోడ్డును దాటే క్రమంలో ఓ మెడికల్ విద్యార్థిని మృతి చెందిందని, మృతురాలి తండ్రి కూడా వికలాంగత్వం పొందాడని అధికారుల తీరుపై మండిపడ్డారు. హైవేపై అక్కడక్కడా అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్లను పూర్తి చేసి ఆయా కాలనీలకు లింక్ రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో హయత్‌నగర్, మన్సురాబాద్ డివిజన్ల కార్పొరేటర్లు కళ్లె నవజీవన్‌రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.