సంగారెడ్డి డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వార్షిక నేరగణాంకాల నివేదికను మంగళవారం ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిగాచి పరిశ్రమ ప్రమాదానికి సంబంధించి యాజమాన్యంపై కేసులు నమోదు చేశామని,వెంటనే అరెస్టులు చేయడం సాధ్యం కాదన్నారు. అనేక సాంకేతిక అంశాలు ముడిపడటమే ఇందుకుకారణమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 2025లో జిల్లాలో నేరాలు గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. నిరంతరం నిఘా, శాంతిభద్రతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్లనే నేరాలు ఒక శాతం తగ్గినట్లు చెప్పారు. గత ఏడాది జిల్లాలో నేరాలకు సంబంధించి 8344 కేసులు నమోదు కాగా ఈఏడాది 8255 కేసులు నమోదైనట్లు వివరించారు. తీవ్రమైన కేసులు 28 శాతం తగ్గినట్లు వివరించారు. లైంగికదాడుల కేసులు 21 శాతం, హత్యలు 32 శాతం తగ్గాయన్నారు.
పగటి దొంగతనాలు 19 శాతం, దొపడీలు 33 శాతం తగ్గినట్లు చెప్పారు. దొంగతనాల కేసుల్లో రికవరీ 25 శాతం పెరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు 4.2 శాతం తగ్గినట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం 2.3 శాతం తగ్గిందన్నారు. జిల్లాలో మహిళలపై నేరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది 207 పోక్సో కేసుల్లో కౌన్సెలింగ్ నిర్వహించి మెడికో లీగల్ సర్వీసులు అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది గంజాయిసాగు, రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. 41 గంజాయి కేసులు నమోదు చేసి 786 కిలోలు సీజ్ చేశామన్నారు.
జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు చేసినా, రవాణా, విక్రయాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే ఏడాది సైబర్, గేమింగ్ నేరాలు అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైబర్, గేమింగ్ మోసాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని తెలిపారు. అత్యవసర, ఆపద సమయాల్లో 100 ఫోన్ చేస్తే పోలీసులు ఆరు నిమిషాల వ్యవధిలో నేరస్థలానికి చేరుకుని నేరాల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో నేరాల కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్‌రావు, డీఎస్పీలు సత్తయ్యగౌడ్, ప్రభాకర్, వెంకట్‌రెడ్డి, సైదా నాయక్, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.