Saudi Arabia : సౌదీ అరేబియాలో ఎక్కువ భాగం ఎడారి (Desert) ప్రాంతమే కనిపిస్తుంది. అక్కడ భరించలేని వేడి, పొడి వాతావరణం, ఇసుక తిన్నెలు ఉంటాయి. అలాంటి వాతావరణం ఉండే ఆ దేశాన్ని అనూహ్యంగా మంచు దుప్పటి (Snow blanket) కప్పేసింది. అంతేకాదు అక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు (Temparatures) జీరోకు పడిపోతున్నాయి. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా కనిపిస్తున్న ఈ వాతావరణ మార్పు ప్రజలకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తోంది.
సౌదీ అరేబియాలోని ఉత్తర, మధ్య ప్రాంతంలో ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తబుక్ ప్రావిన్స్‌లోని పర్వత శ్రేణులు ఎప్పుడూ లేనివిధంగా దర్శనమిస్తున్నాయి. అక్కడ 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రొజెనాపై మంచుతోపాటు వర్షం పడింది. హెయిల్ ప్రాంతంలోనూ అదే పరిస్థితి కనిపించింది. అలాగే చలిగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా ఈ వాతావరణ పరిస్థితులపై సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. రాజధాని నగరం రియాద్‌కు ఉత్తరం వైపున విస్తరించిన ఎత్తయిన ప్రదేశాల్లో హిమపాతం కురిసినట్లు వెల్లడించింది. మేఘాలతో చల్లనిగాలులు సంఘర్షణ చెందడంవల్ల ఇలాంటి వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొంది. వరదలు సంభవించే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు చెప్పాలని రియాద్‌లోని పాఠశాల యాజమాన్యాలను అధికారులు ఆదేశించారు.