Sonakshi Sinha | బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీపై బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోనాక్షికి పెళ్లయి పది రోజులు అయినా అయ్యిందో లేదో అప్పుడే ఆమె గర్భవతి అని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్ కాస్త సోనాక్షి చెవిన చేరడంతో ఆమె ఘాటుగా స్పందించింది. తాజాగా కాకుడ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సోనాక్షి తన పెళ్లి తర్వాత జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
పెళ్లికి ముందు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నానని సోనాక్షి సిన్హా తెలిపింది. జీవితం ఇంతకంటే అందంగా, గొప్పగా ఉండదేమో అనిపిస్తోందన్నారు. ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నానని పేర్కొంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు లేదని చెప్పింది. పెళ్లి తర్వాత మళ్లీ తన సినిమాల చిత్రీకరణ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపింది.
పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక మార్పు ఏంటంటే.. ఇకపై మేం హాస్పిటల్‌కు వెళ్లాలని అనుకోవడం లేదని సోనాక్షి సిన్హా తెలిపింది. ఎందుకంటే మేం అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నారని.. ఇదొక్కటే ఆలోచనలో ఉంటున్నారని చెప్పింది.
గత నెల 23వ తేదీన తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుని సోనాక్షి సిన్హా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవల తన తండ్రి శత్రుఘ్న సిన్హా జ్వరం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో ఆయన్ను చూసేందుకు భర్తతో కలిసి వెళ్లింది. దీంతో అప్పట్నుంచి సోనాక్షిపై ప్రెగ్నెన్నీ వార్తలు మొదలయ్యాయి.