న్యూఢిల్లీ, మార్చి 12: ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వంటగ్యాస్ సిలిండర్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నవేళ.. కేంద్రం మాత్రం దేశంలో ఎలాంటి సంక్షోభం లేదని వెల్లడించింది. హొర్ముజ్ జలసంధి మూసివేసినప్పటికీ భారత్లో చమురు నిల్వల కొరత లేదని కేంద్ర ఇంధన మంత్రి హర్దీప్ పురి గురువారం లోక్సభలో వెల్లడించారు. ముడి చమురు దిగుమతులు, దేశీయ ఎల్పీజీ సరఫరా విషయంలో దేశం పూర్తి సురక్షితమైన స్థితిలో ఉందని అన్నారు. సామాన్యులకు ఎల్పీజీ, ఇంధన సమస్య రానివ్వబోమని కేంద్ర మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.
ఎల్పీజీ ఉత్పత్తి 28 శాతం పెంచుతూ రిఫైనరీలు పనిచేస్తున్నాయని అన్నారు. ‘పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, కిరోసిన్ సరిపడా నిల్వలు ఉన్నాయి. సరఫరాకు ఎలాంటి అంతరాయమూ ఉండదు. ఇందుకు కేంద్రం పూర్తి భరోసా ఇస్తుంది’ అని కేంద్ర మంత్రి సభలో వెల్లడించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభంలో భారత్కు ఎలాంటి పాత్ర లేదని, దాని పర్యవసనాలను మాత్రం భారత్ ఎదుర్కొంటున్నదని అన్నారు. ప్రపంచం ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితుల్ని చవిచూడలేదని అన్నారు.
దేశంలో ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదంటూనే.. కేంద్రం కిరోసిన్ సరఫరా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు రాష్ర్టాలకు 40 వేల కిలోలీటర్ల అదనపు కిరోసిన్ కేటాయించనున్నట్టు కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ సరఫరా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
కేవలం ప్రాధాన్యతా క్రమంలో ఈ సిలిండర్ల పంపిణీ చేయాలని రాష్ర్టాలకు తేల్చి చెప్పింది. ఇందుకోసం గాను లబ్ధిదారుల జాబితాను తయారుచేయాలని కేంద్ర చమురు, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్ధిదారులకు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తామని మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. దేశంలో ముడి చమురు సరఫరా పరిస్థితి సౌకర్యవంతంగానే ఉందని, ఒక లక్ష పెట్రోల్ పంపుల్లో ఎక్కడా ఇబ్బంది రాలేదని అన్నారు.