పదేండ్లలో శిఖరాగ్రానికి చేరిన తెలంగాణ ప్రగతి ఖ్యాతి.. రెండేండ్లలోనే పాతాళానికి పడిపోయింది. కేసీఆర్ ఏలుబడిలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్ర ఆర్థికం.. కాంగ్రెస్ పాలనలో చీకట్లలో మునిగింది. నిన్న దేశానికే దిక్సూచి! నేడు దిక్కుతోచని స్థితి!
రాష్ట్రం మెల్లమెల్లగా రుణ ఊబిలోకి జారిపోతున్నది. ఈ ఏడాది అప్పుల్లో దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది తెలంగాణ. పోనీ, అప్పు చేసి కొత్తగా కట్టిందేమైనా ఉన్నదా? అంటే అదీ లేదు. హామీలకూ అతీగతీ లేదు. సంక్షేమ పథకాలు చతికిలపడ్డాయి. బిల్లులు చెల్లించలేక దవాఖానలకు మందులు బంద్ అయ్యాయి. పంప్‌హౌస్‌లకు కరెంటు కట్ అయ్యింది. కొలువుల సంగతేందని నిరుద్యోగులు కొట్లాడుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేది ఎప్పుడంటూ ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఆరుగ్యారెంటీలు ఆవిరైపోతుంటే.. కాంగ్రెస్ చేతిలో దగాపడిన ఒక్కోవర్గం దండుకడుతున్నది. సర్కార్‌పై భ్రమలు తొలగిన సకల జనులు .. పోరుబాట పడుతున్నరు.
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతోపాటు అభివృద్ధిలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడమే కాకుండా, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా నిలిచింది. తద్వారా ఆర్థిక ధీమాకు తెలంగాణ చిరునామాగా మారింది. ఓవైపు కేంద్ర గ్రాంట్లపై ఆధారపడటం తగ్గించి, సొంత పన్నుల ఆదాయాన్ని 80 శాతానికి పెంచుకొని ఆర్థిక సుస్థిరతను ప్రదర్శించింది. మరోవైపు మానవ వనరుల అభివృద్ధికి, సామాజిక సేవలకు సుమారు 39 శాతం నిధులను కేటాయించింది.
ఇంకోవైపు ఆస్తుల సృష్టి కోసం వెచ్చించే నిధులను రూ.43,918 కోట్లకు పెంచి దార్శనికతను చాటుకున్నది. దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాల అప్పుల సగటు 30 శాతం నమోదుకాగా, తెలంగాణ దానిని 27.2 శాతానికే పరిమితం చేసింది. ఇవి బీఆర్ఎస్ నేతలు చెప్పిన గణాంకాలో, వ్యాఖ్యానాలో కావు. ప్రఖ్యాత ఆర్థిక రంగ నిపుణులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నీతిఆయోగ్ ఆధ్వర్యంలోని ‘2023-24 ఆర్థిక ఆరోగ్య సూచీ’ (ఎఫ్హెచ్ఐ) నివేదిక వెల్లడించిన గణాంకాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని నాలుగు కీలక అంశాలను (వ్యయ నాణ్యత, రాబడి సమీకరణ, ఆర్థిక క్రమశిక్షణ, అప్పుల సుస్థిరత) పరిశీలించి ఎఫ్హెచ్సీ ఈ నివేదికను తయారు చేసింది. దీనిని అన్ని రాష్ర్టాల ఆర్థిక ఆరోగ్య నివేదికగా అభివర్ణిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం 2023-24లో అభివృద్ధి వ్యయం, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమంలో తన మార్క్‌ను ప్రదర్శించింది.
ఓవైపు సొంత పన్ను ఆదాయం గణనీయంగా పెరగడం, మరోవైపు రాజ్యాంగబద్ధమైన పరిమితులకు లోబడే ఆర్థిక లోటును నిర్వహించడం రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2019-24 మధ్య అభివృద్ధి వ్యయాన్ని అద్భుతంగా పెంచింది. మొత్తం రెవెన్యూ వ్యయంలో సామాజిక సేవల వాటా 38-39 శాతం వద్ద స్థిరంగా ఉంటూ, మానవ వనరుల అభివృద్ధి, సంక్షేమంపై గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం వల్ల ఆర్థిక సేవల వాటా 22 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. ప్రతి రాష్ర్టానికీ మూలధన వ్యయం చాలా ముఖ్యం. ఆస్తుల సృష్టి కోసం చేసే ఈ వ్యయం 2019-20లో రూ.16,860 కోట్లుగా ఉండగా, 2023-24 నాటికి రూ.43,918 కోట్లకు చేరింది. అంటే ఐదేండ్లలోనే 160 శాతం కన్నా ఎకువ వృద్ధిని నమోదు చేసింది.

రాష్ట్రం కేంద్ర గ్రాంట్లపై ఆధారపడటం తగ్గించి, స్వయం సమృద్ధి దిశగా దూసుకెళ్లిందని నివేదిక స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,02,543 కోట్లు ఉన్న మొత్తం రాబడి, 2023-24 నాటికి రూ.1,69,293 కోట్లకు పెరిగింది. సొంత పన్నుల రాబడిలోనూ గణనీయ పురోగతి సాధించింది. రాష్ట్రం మొత్తం రాబడిలో సొంత పన్నుల వాటా 2022-23లో 74 శాతం ఉండగా, 2023-24 నాటికి 80 శాతానికి పెరిగింది. 2019-20 నుంచి పన్నేతర ఆదాయం ఏటా 33 శాతం సగటు వృద్ధిని సాధించగా, పన్ను ఆదాయం 13.4 శాతం ప్రగతిని సాధించింది.
కేంద్ర ప్రభుత్వం విధించే రుణ పరిమితి (ఎఫ్ఆర్బీఎం)కి లోబడే తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ పాటించింది. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలు పాటిస్తూనే అద్భుతమైన ఫలితాలను సాధించింది. 2019-20లో రూ.6,254 కోట్ల రెవెన్యూ లోటులో ఉన్న తెలంగాణ, 2022-23 నాటికి రూ.5,943 కోట్ల రెవెన్యూ మిగులు సాధించింది. 2023-24లో రూ.779 కోట్ల రెవెన్యూ మిగులును నమోదు చేసింది. రాష్ట్ర ఆర్థిక లోటు జీఎస్డీపీలో 3.33 శాతం వద్ద ఉండి, పరిమితులకు లోబడే ఉన్నది. దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రం పైన చెప్పిన నాలుగు అంశాల్లో మెరుగైన స్థితిలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం పదేండ్ల (2014-2024)లో అధిక వృద్ధి – నియంత్రిత అప్పులు అనే సూత్రాన్ని పాటించింది. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత పాటిస్తూ,
సొంత ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా దేశానికే మోడల్‌గా నిలిచిందని ఎఫ్హెచ్ఐ నివేదిక స్పష్టం చేసింది.