Cockroaches : ఆస్ట్రేలియా (Australia) లో నిషేధిత బొద్దింకల (Cockroaches) కోసం అధికారులు జరిపిన ఒక భారీ ఆపరేషన్లో లక్షకుపైగా బొద్దింకలు సీజయ్యాయి. దేశంలోకి దిగుమతి చేసుకోవడం లేదా పెంచడంపై నిషేధం ఉన్న ఈ బొద్దింకలను ఒకే బ్రీడర్ నుంచి పట్టుకోవడం సంచలనం సృష్టిస్తోంది. దేశ చరిత్రలో అకశేరుకాలకు (వెన్నెముక లేని జీవులు) సంబంధించి ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని అధికారులు వెల్లడించారు. న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలోని బాథర్స్ట్ నగరంలో మే నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక కమర్షియల్ బ్రీడర్ వద్ద జరిపిన సోదాల్లో మడగాస్కర్ హిస్సింగ్ (Madagaskar Hissing), డూబియా (Dubia) జాతులకు చెందిన లక్షకుపైగా బొద్దింకలను గుర్తించినట్లు ఆస్ట్రేలియా పర్యావరణ విభాగం తెలిపింది.
వీటి విలువ సుమారు 2,00,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.1.35 కోట్లు) ఉంటుందని అంచనా. ఈ మడగాస్కర్ బొద్దింకలు ప్రపంచంలోనే అతిపెద్ద జాతులలో ఒకటి. ఇవి 5 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. సాధారణ ఆస్ట్రేలియన్ బొద్దింకల కన్నా ఇవి చాలా పెద్దవి. స్థానికంగా పాములను పట్టే స్టెఫానీ లెస్సర్ మాట్లాడుతూ.. పెంపుడు సరీసృపాలకు తక్కువ ఖర్చుతో కూడిన ఆహారం అందించేందుకు ఈ పెద్ద బొద్దింకలను అమ్ముతున్నారని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలో కఠినమైన బయోసెక్యూరిటీ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దేశీయ వృక్ష, జంతుజాలాన్ని కాపాడేందుకు ఇలాంటి విదేశీ జీవులను పెంచడం, అమ్మడం చట్టవిరుద్ధం.
విదేశీ బొద్దింకలు పర్యావరణానికి ప్రమాదకరం కావచ్చని, స్థానిక జీవవైవిధ్యానికి హాని కలిగించడంతో పాటు వ్యాధులను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. అయితే బాథర్స్ట్కు చెందిన బ్రీడర్పై ప్రస్తుతానికి ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బొద్దింకలన్నింటికీ కారుణ్య మరణం విధించనున్నట్లు వారు తెలిపారు.