Madhuri Dixit | సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ద్వంద్వ ప్రమాణాలపై, పితృస్వామ్య మనస్తత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్. ప్రేమ, బంధాల విషయంలో పురుషులను ఒకలా, స్త్రీలను మరోలా చూసే వివక్ష సమాజంలో ఇంకా బలంగా నాటుకుపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పురుషుల శృంగార ఎంపికలను సమాజం గొప్పగా చూస్తుందని, అదే సమయంలో మహిళలు అలాంటి ఎంపికలు చేసుకుంటే తప్పుగా చిత్రీకరిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇది పూర్తిగా పితృస్వామ్య సమాజమని, కాలం మారుతున్నా మొదటి నుంచి ఉన్న ఆ పాత ఆలోచనలే కొనసాగుతున్నాయని విమర్శించారు. పురుషుడికి ఎక్కువ మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటే అతడిని ‘క్యాసనోవా’ అని పిలుస్తూ గొప్పగా చూస్తారని, అదే ఒక మహిళకు ఎక్కువ మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే ఆమెను ఎంతో నెగెటివ్‌గా చూస్తూ రకరకాల పేర్లతో దూషిస్తారని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తన తాజా చిత్రం ‘మా బెహన్’ (Maa Behen) సమాజం సృష్టించిన ఇలాంటి సాంప్రదాయ నిబంధనలను, కట్టుబాట్లను బద్దలు కొడుతుందని 59 ఏళ్ల మాధురీ దీక్షిత్ తెలిపారు. ఈ సినిమాలో సమాజం సృష్టించిన ప్రతి నియమాన్ని తాము బ్రేక్ చేశామని, ఆ పాత్రలు చేస్తున్నప్పుడు తాము ఎంతో ఆనందించామని చెప్పారు. ఇందులోని పాత్రలు ఎంతో గందరగోళంగా, నిజ జీవితంలో ఉండే సాధారణ మనుషులకు ఎంతో దగ్గరగా, రిలేటబుల్‌గా ఉంటాయని ఆమె వివరించారు. సురేష్ త్రివేణి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా బెహన్’ ఒక బ్లాక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఇందులో మాధురీ దీక్షిత్‌తో పాటు తృప్తి డిమ్రి, ధరణ దుర్గా, రవి కిషన్, గీతాంజలి కుల్కర్ణి, అరుణోదయ్ సింగ్, శార్దూల్ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు.