సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : నగరంలో యాప్ ఆధారిత వాహన సేవలు మరింత ఖరీదుగా మారాయి. ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ ధరలు పెరిగాయని రైడ్‌పై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కంపెనీలు సూచించిన మొత్తం కంటే అదనంగా రూ.40 నుంచి 50 వసూలు చేస్తున్నారు. రైడ్‌కు అంగీకరించని వారితో కొంతమంది డ్రైవర్లు ఘర్షణకు దిగుతున్నారు.
ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మాన్విత అనే ప్రయాణికురాలు తెలిపారు. ఆమె బంజారాహిల్స్ నుంచి సికింద్రాబాద్‌కు ఆటో బుక్ చేసుకోగా రూ.270 చార్జీ చూపించింది. డ్రైవర్ వచ్చాక ఆ ధరను మరో రూ.50 కలిపి 320 చెప్పాడు. దీంతో తాను అంత చెల్లించలేనని కంపెనీ సూచించిన మొత్తం మాత్రమే ఇస్తానని పేర్కొన్నారు. కానీ సదరు డ్రైవర్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. రైడ్ రద్దు చేసుకోవాలంటూ బెదిరించాడని తెలిపారు.
ఇలాంటి ఘటనలు నగరంలో చాలా జరుగుతున్నాయి. ఆటో గ్యాస్ ధరలు పెరిగితే డ్రైవర్లు ఆ ధరలను ప్రజలపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి గ్యాస్ ధరలపై, యాప్ డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, గ్యాస్ ధర రూ.40కి పైగా పెరగడంతో తాము ఎలా బతకాలని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. అందుకే కంపెనీలతో సంబంధం లేకుండా తాము గిట్టుబాటు అయ్యేలా ధరలు చెబుతున్నట్టు వివరించారు. మరోవైపు తక్కువ చార్జీ ఉన్న రైడ్లను డ్రైవర్లు యాక్సెప్ట్ చేయకపోవడంతో నగర ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్క రైడ్ బుకింగ్‌కు అరగంటకు పైగా సమయం పట్టిందని వాపోయారు.