న్యూఢిల్లీ, మార్చి 12: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం భారత్‌లోని పలు చిన్నచిన్న వీధి వ్యాపారులపై పడింది. ముఖ్యంగా ఉత్తరాదిలో చాయ్ వాలా నుంచి చాట్ వాలా వరకు.. కచోరీ వాలా నుంచి కబాబ్ వాలా వరకు.. దక్షిణాదిలోని మిర్చి బజ్జీ వాలా నుంచి, ఇడ్లీ దోశ వాలా వరకు దీని ప్రభావం తీవ్రంగా చూపుతున్నది.
రేపోమాపో తమ దుకాణాలను బంద్ చేసుకోవాల్సిందేనని, అదే జరిగితే తమకు పస్తులు తప్పవని వీరు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోట్లాది మంది భారతీయుల ఆహార అలవాట్లలో భాగంగా మారిన ఈ తినుబండారాలు లేకపోతే పౌరులు పడే బాధ వర్ణనాతీతం. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల హాకర్లపై దీని ప్రభావం కన్పించింది. గ్యాస్ లేకపోతే తమ వ్యాపారం ఎట్టిపరిస్థితుల్లో నడవదని ముంబైకు చెందిన ఒక చాయ్‌వాలా ఆవేదన వ్యక్తం చేశాడు.
తన దగ్గర ఉన్న గ్యాస్ ఇంకా ఒక రోజు మాత్రమే వస్తుందని, తర్వాత వ్యాపారం మూసివేయడం తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నాడు. ఈ గ్యాస్ కొరత తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నదని నోయిడాకు చెందిన రామ్‌దేవ్ స్వీట్స్ యజమాని ఆనంద్ ఆవేదన వ్యక్తం చేసాడు. తన దగ్గర ఉన్న గ్యాస్ బండ అయిపోయిందని, బ్లాక్‌లో 3 వేల రూపాయలకు గ్యాస్ కొన్నానని, దాంతో 10 రూపాయలు అమ్మే చాయ్‌ను రూ.15కు అమ్ముతున్నానని జైపూర్‌కు చెందిన ఒక టీ వాలా తెలిపాడు.