Yashasvi Jaiswal : రేపటితో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ సమరానికి తెర లేవనుంది. పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి టెస్టు పోరు మొదలు కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో ఉన్న ఇరుజట్లకు ఈ ట్రోఫీ చాలా కీలకం. అందుకని ‘నువ్వా నేనా’ అన్నట్టు తలపడేందుకు భారత, ఆసీస్ క్రికెటర్లు సిద్దమవుతున్నారు. అయితే.. ఇటు టీమిండియా అటు కంగారూ ఆటగాళ్ల దృష్టంతా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) మీదే ఉంది.
వెస్టిండీస్‌పై, ఆపై ఇంగ్లండ్ మీద సెంచరీలతో కదం తొక్కిన ఈ చిచ్చరపిడుగు ఆస్ట్రేలియాలో ఆడడం ఇదే మొదటిసారి. దాంతో, ఈ యువకెరటం ఆసీస్ పేస్ దళాన్ని ఎలా ఎదుర్కొంటాడు? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఐపీఎల్ ప్రదర్శనతో జట్టులోకి వచ్చిన యశస్వీ భారత జట్టు ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు. దూకుడైన ఆటకే కాదు చెక్కుచెదరని ఏకాగత్రకు కేరాఫ్ అయిన యశస్వీ కెరీర్లో అసలైన పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. పేస్, బౌన్స్‌కు స్వర్గధామమైన ఆస్ట్రేలియా గడ్డ మీద తొలి సవాల్‌కు కాచుకుని ఉన్న ఈ టీనేజర్ పరగుల వరద పారించడం ఖాయమంటున్నారు మాజీ ఆటగాళ్లు. ఎందుకంటే.. నిరుడు విండీస్ గడ్డపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వీ.. సూపర్ సెంచరీతో మెరిశాడు. అంతేనా.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో రెచ్చిపోయిన యశస్వీ ఏకంగా డబుల్ సెంచరీతో దడ పుట్టించాడు.
𝘽𝙚𝙞𝙣𝙜 𝙔𝙖𝙨𝙝𝙖𝙨𝙫𝙞 ✨
He’s hungry for the challenge Down Under!
Full Interview out tomorrow at 9 AM on https://t.co/Z3MPyeL1t7 💻📱
Stay Tuned ⏳#TeamIndia | #AUSvIND | @ybj_19 pic.twitter.com/P1tiYcMPFU
— BCCI (@BCCI) November 20, 2024
అంతే.. ‘రికార్డు బ్రేకర్ ట్యాగ్’ అతడి సొంతమైంది. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ వంటి పేసర్లను దీటుగా ఎదుర్కొన్నఈ చిచ్చరపిడుగు.. ఐపీఎల్లో ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో దంచేశాడు. పైగా ఈ మధ్యే ముగిసిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లలో యశస్వీ అర్ధ శతకాలతో ఫామ్ కొనసాగించాడు. అందుకని ఆసీస్ గడ్డపై కూడా ఈ యువ ఓపెనర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడం ఖాయమంటున్నారు అతడి సత్తా తెలిసిన వాళ్లంతా. కంగారూ నేల మీద మొదటి పరీక్షలో యశస్వీ పాస్ అవుతాడా? లేదా సగటు మార్కులు తెచ్చుకుంటాడా? అనేది ఈ సిరీస్‌తో తెలిసిపోనుంది.
అంతర్జాతీయ క్రికెట్లో సంచలనంగా మారిన యశస్వీ వరసగా రికార్డులు బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. చిన్నవయసులోనూ ‘థౌంజడ్వాలా’గా రికార్డు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు టెస్టుల్లో సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి భారత దిగ్గజ క్రికెటర్లకు సైతం సాధ్యంకాని రికార్డు సృష్టించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అలరించే ఈ యంగ్‌స్టర్ తొలి 10 మ్యాచుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. తద్వారా 147 ఏండ్ల సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో ఈ ఘనతకు చేరువైన భారత ఆటగాడిగా నిలిచాడు.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ సిరీస్(England Sereis)లో దంచికొట్టిన యశస్వీ టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ధర్మశాల టెస్టులో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ బాది యశస్వీ ఈ మైలురాయికి చేరువయ్యాడు. దాంతో, తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు బాదిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ చిచ్చరపిడుగు 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ (Vinod Kambli) 14 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి రన్స్ కొట్టాడు. 18 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు కొట్టిన ఛతేశ్వర్ పూజారా మూడో స్థానానికి పడిపోయాడు. అంతేకాదు బ్యాటింగ్ యావరేజ్లోనూ యశస్వీ రికార్డులు బ్రేక్ చేశాడు.
వినోద్ కాంబ్లీ 83.33 సగటుతో టాప్‌లో నిలవగా.. యశస్వీ 71.43 సగటుతో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 7 మ్యాచుల్లోనే ఈ మైలురాయికు చేరుకోగా.. యశస్వీ 9 వ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఎవర్టన్ వీకెస్, హెర్బెర్ట్ సట్క్లిఫె, జార్జ్ హెడ్లేలు 9 మ్యాచుల్లో వెయ్యి రన్స్ కొట్టారు.
అత్యంత చిన్నవయసులోనే టెస్టుల్లో వెయ్యి రన్స్ కొట్టిన యశస్వీ.. మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డు బ్రేక్ చేశాడు. సచిన్ 19 ఏండ్ల 217 రోజుల్లో వెయ్యి పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. యశస్వీ 22 ఏండ్ల 70 రోజుల్లో వెయ్యి రన్స్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. భారత దిగ్గజం కపిల్ దేవ్ 21 ఏండ్ల 27 రోజుల్లో ఈ ఫీట్ సాధించాడు.