BGT 2024-25 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు సిద్దమవుతున్న భారత జట్టుకు శుభవార్త. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) త్వరలోనే జట్టుతో కలువనున్నాడు. రెండోసారి తండ్రి అయిన హిట్‌మ్యాన్ ప్రస్తుతం ముంబైలోనే ఉన్నాడు. అయితే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో కీలకమైన సిరీస్ కావడంతో రోహిత్ సెలవులను తగ్గించుకున్నాడు.
జట్టును ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో ఆసీస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. పెర్త్ టెస్టు మొదలైన రెండు రోజులకు అతడు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనున్నాడు. అంటే నవంబర్ 24న రోహిత్ భారత బృందంలో చేరుతాడు. అడిలైడ్ ఓవల్‌లో జరిగే రెండో టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
రోహిత్ శర్మ ఈమధ్యే రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య రితికా సజ్దేహ్(Ritika Sajdeh) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో, రోహిత్ కుటుంబంతో కొన్ని రోజులు గడపాలనే ఉద్దేశంతో పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు. రోహిత్ గైర్హాజరీలో జట్టుకు ఓపెనింగ్ సమస్య ఎదరువుతోంది. యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal)కు జోడీగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించడం దాదాపు ఖరారై పోయింది.
ఇక.. రోహిత్ అందుబాటులో లేకపోవడంతో పెర్త్ టెస్టుకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) నాయకత్వం వహించనున్నాడు. అడిలైడ్‌లో డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకూ రెండో టెస్టు జరుగనుంది. ఈ టెస్టులో రోహిత్ మళ్లీ కెప్టెన్‌గా బరిలోకి దిగుతాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో విఫలమైన రోహిత్ కంగారూల గడ్డపై చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా దంచికొడితే ఈసారి ఆసీస్ బౌలర్లకు చుక్కలే.