Chateshwar Pujara : ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు తొలి సవాల్ రేపటి నుంచే. పెర్త్ మైదానంలో జరిగే మొదటి టెస్టు కోసం భారత్, ఆసీస్ ఆటగాళ్లు సిద్దమవుతున్నారు. విజయంతో ట్రోఫీలో ముందంజ వేయాలనే కసితో ఉన్న టీమిండియాకు మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. కంగారూ జట్టు మాజీలు సైతం కింగ్ కోహ్లీ రాణించడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. స్వదేశంలో ఈమధ్యే న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీతో విరాట్ నిరాశపరిచాడు. అయితే.. కోహ్లీ ఫామ్‌పై సందేహాలు అవసరం లేదంటున్నాడు ఛతేశ్వర్ పుజారా(Chateshwar Pujara). ఈ ‘నయావాల్’ ఎందుకు అలా అంటున్నాడంటే..?
సుదీర్ఘ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ ఆస్ట్రేలియాపై కూడా చెలరేగుతాడని పూజరా నమ్మకం. అతడేమీ ఊరికే ఈ మాట చెప్పడం లేదు. గతంలో కంగారూ గడ్డపై విరాట్ ఆడిన ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లను మర్చిపోవద్దని, అవే అతడిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని పుజారా అంటున్నాడు. ‘అవును.. గత పర్యటనల అనుభవం కోహ్లీకి కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆసీస్ గడ్డపై అతడు సాధించిన పరుగులే అతడి గురించి మాట్లాడుతాయి.
When Virat Kohli played first time in AUSTRALIA.
At 23, Virat Kohli was India’s highest run-scorer in the 2012 BGT, in a team consisting of Sachin, Dravid, Sehwag, and Laxman. 🐐
pic.twitter.com/npPC1y9kOO— Krishna. (@KrishVK_18) November 17, 2024
ఆస్ట్రేలియా ఒక్కటనే కాదు అన్ని ఫార్మాట్లలో అంచనాలు ఉన్న ప్లేయర్ అతడు. కోహ్లీ ఆడిన మ్యాచులు అతడి ప్రతిభకు అద్దం పడుతాయి. అతడు ఎంత మంచి ఫీల్డరో, అథ్లెటో మనం కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. అతడు ఎంతో కష్టపడుతాడు. పైగా నిలకడగా ఆడుతాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడడం వల్ల ఒక్కోసారి ఏకాగ్రత చెదరడం అనేది సహజమే’ అని పుజారా వెల్లడించాడు.
కెరీర్ చరమాంకంలో ఉన్న కోహ్లీకి బహుశా ఇదే ఆఖరి ఆస్ట్రేలియా పర్యటన కావొచ్చు. దూకుడైన ఆటగాడిగా, వెనక్కి తగ్గని కెప్టెన్‌గా పేరొందిన కోహ్లీ 2018లో కంగారూ గడ్డపై చిరస్మరణీయ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం 2020-21లో పెద్దగా రాణించలేదు. ఇక ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ గణాంకాలు ఘోరంగా ఉన్నాయి. ఆరు టెస్టుల్లో ఈ రన్ మెషీన్ కేవలం 250 పరుగులు చేశాడంతే. కెరీర్ సగటు 50కి పైగా ఉన్న అతడు ఈ ఏడాదిలో 22.72 సగటు నమోదు చేశాడు.
కానీ, ఆస్ట్రేలియాపై విరాట్‌కు అమోఘమైన రికార్డు ఉంది. కంగారూ పేసర్లను ఆడుకున్న అతడు 6 సెంచరీలతో తన ఆధిపత్యాన్ని చాటాడు. తద్వారా కంగారూ గడ్డపై అత్యధిక శతకాలు బాదిన సచిన్ టెండూల్కర్ రికార్డు సమం చేశాడు. ఈసారి కోహ్లీ మూడంకెల స్కోర్ దాటితే సచిన్ రికార్డు బద్దలవ్వడం ఖాయం. అంతేకాదు సుదీర్ఘ ఫార్మాట్లో 30వ సెంచరీ ఖాతాలో వేసుకుంటాడు.