Stocks | గౌతం అదానీతోపాటు అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాలో కేసు నమోదు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 421.80 పాయింట్లు (0.54 శాతం) నష్టపోయి 77,156.80 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 76,802.73 – 77,711.11 పాయింట్ల మధ్య తచ్చాడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 168.80 పాయింట్లు (0.72 శాతం) పతనమై 23,349.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ 23,263.15 పాయింట్ల నుంచి 25,507.30 పాయింట్ల మధ్య సాగింది.
ఇక అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, గ్రూప్ ఇతర ఎగ్జిక్యూటివ్‌లు భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్ల ముడుపులు ఇచ్చారని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో కేసు నమోదైంది. దీంతో నిఫ్టీ-50లో 37 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఎన్టీపీసీ స్టాక్స్ 23.44 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు, పవర్ గ్రిడ్, ఆల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్ తదితర 13 స్టాక్స్ 3.25 శాతం వరకు లాభ పడ్డాయి. బ్రాడర్ మార్కెట్లు – నిఫ్టీ స్మాల్ క్యాప్-100 0.30 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ -100 0.46 శాతం నష్టాలతో ముగిశాయి. ఐటీ, రియాల్టీ, ప్రైవేట్ బ్యాంకు మినహా నిఫ్టీలోని అన్ని సెక్టార్ ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్ సెక్టార్లు రెండు శాతానికి పైగా నష్టపోయాయి.
బీఎస్ఈ-30లోని అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఐటీసీ సహా 20 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. డీ-మార్ట్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, బంధన్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్స్ 52 వారాల దిగువకు పడిపోయాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మరో దఫా అమ్మకాలకు దిగడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి కారణం అని చెబుతున్నారు.