Gautam Adani | తన సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఆమోదించేందుకు గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు భారత్ లోని రాష్ట్రాల అధికారులకు ముడుపులు ఇవ్వ చూపారని ఆరోపణలు వచ్చాయి. గౌతం అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా మరో ఏడుగురు అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు వివిధ రాష్ట్రాల అధికారులకు సుమారు రూ.2,200 కోట్లు (265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇవ్వజూపారని అమెరికా కోర్టులో కేసు నమోదైంది. వివిధ రాష్ట్రాల్లో గుర్తు తెలియని అధికారులకు ముడుపులు ఇవ్వజూపారని ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత ఖర్చుతో కూడుకున్న సౌర విద్యుత్ అంటగట్టేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు ప్రయత్నించారని యూఎస్‌లో దాఖలైన కేసు అభియోగాలు.
20 ఏండ్లలో 200 కోట్ల డాలర్ల లాభాలు గడించాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకున్నదని అభియోగాల సారాంశం. సోలార్ సెల్ అండ్ మాడ్యులర్ ప్లాంట్ల నుంచి స్థానికంగా తయారయ్యే 8,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలను కోరింది అదానీ గ్రూప్. 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటే, ఒడిశా 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, ఛత్తీస్ గడ్ ప్రభుత్వాలతోనూ 2021 జూన్ నుంచి 2021 డిసెంబర్ మధ్య సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న అజూర్ పవర్ మీద అభియోగాలు నమోదయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.