హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అసమర్థతతో ఏపీ ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతున్నది. ఏపీ తానా అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తందాన అంటూ వంతపాడుతున్నది. అందుకు సాగర్ డ్యామ్ నిదర్శనంగా నిలుస్తున్నది. ఏపీ స్వాధీనం చేసుకున్న సాగర్ గేట్లను తిరిగి అప్పగించలేదు. ఆ రాష్ట్రం ఇష్టారీతిన చేపడుతున్న నీటి మళ్లింపులను కేఆర్ఎంబీ పర్యవేక్షించడం లేదు. దీనిపై తెలంగాణ ఫిర్యాదు చేసినా బోర్డు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ, సాగర్ గేట్లకు మాత్రం తెలంగాణే మరమ్మతులు చేయాలట. ఈ విషయమై ఏపీ అడిగిందే తడవుగా తెలంగాణ సర్కార్‌కు కేఆర్ఎంబీ లేఖ రాసింది. సాగర్ కుడివైపు గేట్లకు మరమ్మతులు చేయాలని ఆ లేఖలో ఆదేశించింది. దీనిపై తెలంగాణ ఇంజినీర్లు భగ్గుమంటున్నారు.
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వహణ తెలంగాణ, శ్రీశైలం డ్యామ్ నిర్వహణ ఏపీ చూస్తున్నది. గేట్ల రబ్బర్ సీల్స్, గ్రీజింగ్, రోప్‌ల మార్పిడి, గ్యాంట్రీ పట్టాల మార్పిడి, గ్యాలరీ తదితర పనులను నిర్వహిస్తున్న ఏపీ సర్కార్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నిమగ్నమై ఉన్న వేళ అక్రమంగా సాయుధబలగాలతో తరలివచ్చి డ్యామ్ కుడివైపు భాగాన్ని (13వ గేట్ వరకు), కుడికాలువ రెగ్యులేటర్‌ను ఆక్రమించుకున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి డ్యామ్ కుడివైపు కాంపొనెంట్లన్నీ ఏపీ ఆధీనంలోనే ఉండటంతో సాగర్ కుడికాలువ హెడ్రెగ్యులేటర్లను ఇష్టారీతిన ఆపరేట్ చేస్తూ నీళ్లను మళ్లించుకుపోతున్నది. గేట్ల నిర్వహణను మాత్రం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆ డ్యామ్ నిర్వహణను పూర్తిగా తిరిగి తెలంగాణకు అప్పగించాలని రాష్ట్ర అధికారులు అనేకమార్లు కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేశారు. చోద్యం చూస్తున్న బోర్డు కనీసం నీటి లెక్కలను పర్యవేక్షించడంలేదు.
ప్రస్తుతం సాగర్ డ్యామ్ కుడివైపు గేట్లను మరమ్మతు చేసేందుకు సైతం తెలంగాణ అధికారులను ఏపీ అనుమతించడం లేదు. గతంలో తెలంగాణ ప్రభుత్వం బోర్డు అనుమతులతో కుడివైపు డ్యామ్ నిర్వహణ పనులను చేపట్టడంపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పనులను ఎందుకు చేస్తున్నారు? అవి అత్యవసరమైనవా? కావా? అనే విషయాలను తెలుసుకోవాలని ఏకంగా కేఆర్ఎంబీకే లేఖ రాసింది. ఆ తర్వాత ఏపీ భూభాగంలో ఉన్న డ్యామ్ నిర్మాణాలకు సంబంధించిన మరమ్మతులు, నిర్వహణ పనులను తామే చేసుకుంటామని బోర్డుకు తేల్చిచెప్పింది. అందుకు అనుమతులివ్వాలని బోర్డు చైర్మన్‌కు లేఖ రాసింది. అంతేకాకుండా వర్షాకాలం ముందు, ఆ తర్వాత చేపట్టాల్సిన తనిఖీలు, సాధారణ, అత్యవసర పనులు, నీటి విడుదల పర్యవేక్షణను తమకే అప్పగించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మరమ్మతుల అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని గతంలో బోర్డు నిర్ణయించినా తుదకు ఆ పనులను మళ్లీ ఏపీకే అప్పగించింది. దీంతో డ్యామ్ నిర్వహణను ఏపీ పూర్తిగా గాలికి వదిలేసింది.
హెడ్‌రెగ్యులేటర్ గేట్లను ఇష్టారాజ్యంగా ఆపరేట్ చేయడంతోపాటు గ్రీజింగ్ తదితర పనులను నిర్వహించకపోవడంతో అనేక రకాల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ గేట్లు ప్రమాద స్థితికి చేరుకున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల సాగర్ డ్యామ్‌ను సందర్శించిన ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం.. కుడికాలువ హెడ్‌రెగ్యులేటర్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఈ పరిస్థితికి తెలంగాణే కారణమని పేర్కొంటూ ఏపీ ఉల్టా వాదనలు మొదలు పెట్టడటంతోపాటు బోర్డుకు మరోసారి లేఖ రాసింది. డ్యామ్ నిర్వహణ పనులను చేపట్టకుండా తెలంగాణదే బాధ్యతని పేర్కొనడం ఏపీ సర్కార్ దుర్మార్గానికి అద్దం పడుతున్నది. ఇక ప్రస్తుతం ఏపీ లేఖ రాసిందే తడవుగా బోర్డు సైతం తెలంగాణ వివరణ కోరింది. సాగర్ డ్యామ్ కుడివైపు కాంపొనెంట్లకు తెలంగాణ సర్కారే మరమ్మతులు చేయాలని ఆదేశిస్తూ లేఖ రాసింది. దీంతో ఏపీకి కేఆర్ఎంబీ వంతపాడుతున్నట్టు మరోసారి రుజువైంది. ఈ పరిస్థితికి రేవంత్‌రెడ్డి సర్కార్ అసమర్థతే కారణమని తెలంగాణ ఇంజినీర్లు నిప్పులు చెరుగుతున్నారు.