ముంబై, ఫిబ్రవరి 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ ఇండస్ట్రీ ఆశాజనక పనితీరు కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025-26లో దేశీయ ఐటీ ఇండస్ట్రీ ఆదాయం 6.1 శాతం ఎగబాకి 315 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్టు నాస్కామ్ అంచనావేస్తున్నది. అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరంలో 282.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఐటీ కంపెనీల ఆదాయాన్ని 297 బిలియన్ డాలర్లకు సవరించింది. కిందటేడాది నమోదైన 5.9 శాతం కంటే ఈ ఏడాది 6.1 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నట్టు నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియర్ తెలిపారు.
ఉద్యోగ కల్పనలో ఎల్లప్పుడూ ముందుండే ఐటీ రంగం ఈసారి కూడా అవకాశాలు 2.3 శాతం పెరిగి 59.50 లక్షలకు చేరుకోనున్నాయని చెప్పారు. కిందటేడాది చివరి నాటికి 58 లక్షల ఉద్యోగాలు కలిగివున్నారు. మొత్తంమీద ఈ ఏడాది కొత్తగా 1.35 లక్షల మంది టెక్నాలజీ నిపుణులు జతయ్యారని ఆయన చెప్పారు. కిందటేడాది వచ్చిన 1.33 లక్షల ఉద్యోగాలతో పోలిస్తే కేవలం 2 వేలు పెరిగారని తెలిపారు.