T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఉత్కంఠ పోరాటం అలరించింది. ఆఖరి ఓవర్ వరకూ విజయం దోబూచులాడగా పాకిస్థాన్ (Pakistan), బంగ్లాదేశ్(Bangladesh)లు బోణీ కొట్టాయి. అయితే.. ఈ రెండు మ్యాచుల్లో బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కానీ ఫీల్డింగ్‌లో మాత్రం నాలుగు దేశాల క్రికెటర్లు పేలవ ప్రదర్శన కనబరిచారు. మెగా టోర్నీలో ప్రతి ఒక్క పరుగే కాదు.. ప్రతి క్యాచ్ కూడా ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఈ విషయం తెలిసినా సరే అమ్మాయిలు మాత్రం పలు క్యాచ్‌లు జారవిడిచారు.
అలాగని రెండు మూడు కాదు రెండు మ్యాచుల్లో ఏకంగా 13 క్యాచ్‌లు నేలపాలు చేశారు. దాంతో, ‘ఇదేం ఫీల్డింగ్ రా బాబు’.. ‘అసలు ఇది ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీయేనా?’ అంటూ సోషల్ మీడియలో మీమ్స్ పెడుతున్నారు. వరల్డ్ కప్ ఆరంభ పోరులో బంగ్లాదేశ్, స్కాంట్లాండ్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన స్కాంట్లాండ్ ప్లేయర్లకు నాలుగు సార్లు లైఫ్ దొరికింది. బంగ్లా బౌలర్లు అద్భుతంగా రాణించినా ఫీల్డర్లు మాత్రం తేలికైన క్యాచ్‌లు సైతం వదిలేశారు. ఏకంగా నాలుగు క్యాచ్‌లు నేలపాలు చేయడం గమనార్హం.
A slippery opening day at the #T20WorldCup 👐 pic.twitter.com/CIZJVAfIci
— ESPNcricinfo (@ESPNcricinfo) October 4, 2024
అనంతరం స్కాట్లాండ్ అమ్మాయిలు కూడా తామేమీ తక్కువ కాదన్నట్టు మూడు క్యాచ్‌లు వదిలేశారు. ఇక.. రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో ఎదురుపడిన శ్రీలంక, పాకిస్థాన్ క్రికెటర్లు తలా మూడు క్యాచ్‌లు జారవిడిచారు. అయితే.. లో స్కోరింగ్ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసిన పాకిస్థాన్ గ్రూప్ ‘ఏ’లో అగ్రస్థానంలో నిలిచింది.