ICC : ప్రపంచంలోనే సంపన్నమైన బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలికి పెద్ద షాక్ తగలనుంది. ఇకపై ప్రతి ఏటా అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోనుంది. వరల్డ్ క్రికెట్ సంఘం (డబ్ల్యూసీఏ) ఒత్తిడి మేరకు బీసీసీఐ తాను అందుకుంటున్న సింహ భాగం వాటాను కోల్పోనుంది. ప్రపంచ క్రికెట్లో ఆదాయ పంపిణీలో అసమానతలు ఉన్నాయని, ధనిక బోర్డుకు ఇచ్చే వాటాను తగ్గించుకోవాలని ప్రపంచ క్రికెట్ సంఘం ఈమధ్యే ఐసీసీకి సూచన చేసింది.
ఈ క్రమంలోనే బీసీసీఐకి సమర్పిస్తున్న 40 శాతం వాటాను 10 శాతానికి తగ్గించుకోవాలని సూచించింది డబ్ల్యూసీఏ. అయితే.. ఈ విషయమై ఐసీసీ ఛైర్మన్ జై షా, పాలక మండలి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఐసీసీ తర్వాత ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ పెద్దన్నలా వ్యవహరిస్తూ వస్తోంది. ఈమధ్యే పాకిస్థాన్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదాయ అసమానతల గురించి .. బీసీసీఐ వాటా 30 శాతం తగ్గించడం గురించి ప్రపంచ క్రికెట్ సంఘం సూచన చేయడం బీసీసీఐకి తలనొప్పిగా మారనుంది.