WI vs AUS : ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్ (West Indies) ఒకప్పుడు ఎంతో భయంకరపమైన జట్టు. హిట్టర్లతో, ఆల్‌రౌండర్లతో నిండిన విండీస్ రెండుపర్యాయాలు పొట్టి వరల్డ్ కప్ (T20 World Cup) ఛాంపియన్ కూడా. అలాంటి టీమ్ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క విజయం కోసం అపసోపాలు పడుతోంది. సిరీస్ పోతే పోయింది కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే చాలు పరువు దక్కుతుంది అనే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ధాటికి మూడు టీ20ల్లో మట్టికరిచిన షాయ్ హోప్ సేన నాలుగో పోరులోనూ చతికిలపడింది.
స్వదేశంలో ఏ జట్టైనా పులిలా గర్జిస్తూ.. ప్రత్యర్థుల భరతం పడుతుంది. కానీ, వెస్టిండీస్ మాత్రం చెత్త ఆటతో వరుసగా సిరీస్‌లు సమర్పించుకుంటోంది. ఇదివరకూ సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన విండీస్ ఇప్పుడు ఆసీస్ చేతిలోనూ అదే అవమానానికి చేరువలో ఉంది. టిమ్ డేవిడ్ విధ్వంసక సెంచరీతో మూడో టీ20లో జయభేరి మోగించిన కంగారూ జట్టు.. నాలుగో మ్యాచ్‌లోనూ కరీబియన్ సైన్యాన్ని చిత్తు చేసింది.
One more loss, and it’s a second T20I series whitewash in as many months for West Indies 👀 #WIvAUS pic.twitter.com/o1b9Rg0aP0
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2025
సెయింట్ కిట్స్‌లో జరిగిన గేమ్‌లో రొవ్మన్ పావెల్(28), రొమారియో షెపర్డ్(28)లతో పాటు అందరూ సమిష్టిగా రాణించగా 205 రన్స్ కొట్టింది విండీస్. ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు కాపాడుకుందామనుకున్న హోప్ బృందం ఆశలు ఆడియాసలయ్యాయి.
భారీ ఛేదనలో కామెరూన్ గ్రీన్(55 నాటౌట్), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్(51) లు చెలరేగి ఆడి లక్ష్యాన్ని కరిగించారు. ఇంగ్లిస్ ఔటయ్యాక అరోన్ హర్డీ(23) ధనాధన్ ఆడడంతో 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. ఇరుజట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 జూలై 28న జరుగనుంది.