Monkey U-turn | కోల్ సిటీ, జూలై 27: వానర దళం యూటర్న్ తీసుకొంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన వానర సైన్యం మళ్లీ నగరానికి తిరిగొచ్చింది. గోదావరిఖని తిలక్ నగర్, జవహర్ నగర్, పరశురాంనగర్, విఠల్ గర్ తదితర ప్రాంతాలలో గుంపులు గుంపులుగా ప్రత్యక్షమయ్యాయి.. ఇళ్లపైకి చేరుకొని వికృత చేష్టలు చేస్తున్నాయి. నగరంలో కోతుల బెడదను తప్పించేందుకు నెల రోజుల క్రితం రామగుండం నగర పాలక సంస్థ రూ.10లక్షలు వెచ్చించి ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది.
సదరు ఏజెన్సీ నిర్వాహకులు నగరంలోని కోతులను పట్టి మంథని నియోజక వర్గంలోని భూపాలపల్లి జిల్లా కాటారం దండకారణ్యంలో వదిలిపెట్టినట్లు చెప్పారు. మరికొన్ని బుగ్గ గుట్ట ప్రాంతంలో విడిచిపెట్టారు. కానీ కోతుల లెక్క తప్పిందో ఏమో గానీ, అరణ్యం నుంచి మళ్లీ జనారణ్యంలోకి ప్రవేశించాయి. ఎప్పటిలాగే ఇళ్లపైకి ఎక్కి చిందరవందరం చేస్తున్నాయి. మళ్లీ కోతుల బెడద మొదటికి వచ్చినట్లేనా..? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల సమస్య తీర్చేందుకు నగరపాలక సంస్థ వెచ్చించిన రూ.10 లక్షలు నిరుపయోగమైనట్లేనా..? పలువురు అని ప్రశ్నిస్తున్నారు.