Vinesh Phogat : ఒలింపిక్స్‌లో పతకం చేజారిన బాధ నుంచి తేరుకుంటున్న భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) మళ్లీ ఉద్యమించనుంది. స్వగ్రామంలో జరిగిన సన్మాన సభలో తమ పోరాటం కొనసాగనుందని ఆమె చెప్పింది. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan)కు వ్యతిరేకంగా ఆమె మరోసారి తన గళం వినిపించనుంది.
ఈ పరిస్థితుల్లో హర్యానా పోలీసులు తనకు భద్రత కల్పించడం లేదంటూ శుక్రవారం ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అయితే.. వినేశ్ మాటల్ని ఢిల్లీ పోలీసులు కొట్టిపారేశారు. ‘రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించామనే వార్తలు అబద్ధం. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని హర్యానా పోలీసులకు ఆదేశాలిచ్చాం. ఎందుకంటే.. ఉద్యమించనున్న రెజ్లర్లు ఉండేది ఇక్కడే కదా’ అని ఢిల్లీ డీసీపీ కార్యాలయం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
The security provided to the wrestlers hasn’t been withdrawn; it was decided to request Haryana Police to takeover the responsibility in future, since the protectees normally reside there.
— DCP New Delhi (@DCPNewDelhi) August 22, 2024
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బ్రిజ్ భూషణ్‌పై నిరుడు వినేశ్ ఫొగాట్ నేతృత్వంలో పెద్ద పోరాటమే జరిగింది. విశ్వ క్రీడల్లో పతకాలు గెలిచిన కుస్తీ యోధులంతా వినేశ్‌కు మద్దతుగా నిలిచారు. దాంతో, దిగొచ్చిన భారత ఒలింపిక్ సంఘం భూషణ్‌ను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా తొలగించింది. ఆ తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో అతడి అనుచరుడైన సంజయ్ సింగ్ (Sanjay Singh)గెలుపొందాడు. అప్పటి నుంచి భారత రెజ్లర్లకు కష్టాలు మొదలయ్యాయి. భూషణ్ బృందం ఎన్ని అడ్డంకులు సృష్టించిన చివరకు వినేశ్ ఒలింపిక్స్ పోటీలకు వెళ్లింది.
కెరీర్లో మూడో ఒలింపిక్స్ బరిలో నిలిచిన వినేశ్ పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 50 కిలోల విభాగంలో అదరగొట్టిన ఆమె అలవోకగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే.. అనూహ్యంగా ఫైనల్ ఫైట్‌కు ముందు 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హతకు గురైంది. ఆ బాధలోనే రెజ్లింగ్‌కు వీడ్కోలు కూడా చెప్పిన వినేశ్ తనపై వేటు సవాల్ చేస్తూ అర్బిట్రేషన్ కోర్టు (CAS)లో అప్పీల్ చేసింది.
క్యూబా బాక్సర్తో పాటు సంయుక్తంగా తనకు రజతం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. కానీ, ఆమె డిమాండ్‌ను కాస్ తోసిపుచ్చింది. విభాగానికి సరిపోయేంత బరువు ఉండడం అనేది అథ్లెట్ల బాధ్యత అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ మినహాయింపులు ఉండవని కాస్ చెప్పింది. వినేశ్ ఫొగాట్ విషయంలోనూ తాము అదే నియమాన్ని అనుసరించామ’ని అర్బిట్రేషన్ కోర్టు తన 24 పేజీల తీర్పులో తెలిపింది.