Tristan Stubbs : పొట్టి ప్రపంచ కప్ ముగిసి రెండు నెలలు కావొస్తోంది. అయినా సరే టీమిండియా (Team India) చేతిలో ఓటమి దక్షిణాఫ్రికా(South Africa) జట్టును వెంటాడుతోంది. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నామనే బాధ సఫారీ ఆటగాళ్లను వేధిస్తోంది. ఇప్పటికే డేవిడ్ మిల్లర్(David Miller), హెన్రిచ్ క్లాసెన్‌లు వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని మర్చిపోలేకపోతున్నామని తెలిపారు. తాజాగా ఆ జట్టు భావితార ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs) సైతం తాను ఎంత ప్రయత్నించినా ఫైనల్ పరాజయం బాధ పోవట్లేదని అన్నాడు.
‘టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి మేము ఊహించనిది. ఆ పరాజయాన్ని మర్చిపోయేందుకు ఎంతగానో ప్రయత్నించాను. కానీ, అది అంత సులువు కాదు’ అని స్టబ్స్ అన్నాడు. బార్బడోస్ వేదికగా జరిగిన భారత్‌తో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయానికి చేరువైంది. 177 పరుగుల ఛేదనలో ఓపెనర్ క్వింటన్ డికాక్(39) అండగా స్టబ్స్ (31 : 21 బంతుల్లో) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఓటమి బాధలో సఫారీ ఆటగాళ్లు
అయితే.. డికాక్‌తో కలిసి ధాటిగా ఆడుతున్న స్టబ్స్‌ను బౌల్డ్ చేసిన అక్షర్ పటేల్ దక్షిణాఫ్రికాను దెబ్బ కొట్టాడు. కానీ, డేవిడ్ మిల్లర్(21) అండగా హెన్రిచ్ క్లాసెన్(52) హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. అక్షర్ వేసిన ఓవర్లో సిక్సర్లతో విరుచుకుపడి సమీకరణాలు మార్చేశాడు. దాంతో, భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. హార్దిక్ పాండ్యా ఓవర్లో క్లాసెన్ ఔట్ కావడంతో భారత అభిమానులకు ప్రాణం లేచివచ్చనిట్టు అయింది.
హెన్రిచ్ క్లాసెన్(52)
క్లాసెన్ విధ్వంసంతో గెలుపు వాకిట నిలిచిన సఫారీ జట్టు ఆ తర్వాత ఒక్కసారిగా తడబడింది. 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన దశలో ఒత్తిడికి లోనైంది. జస్ప్రీత్ బుమ్రా(2/18) సంచలన బౌలింగ్‌తో ఎడెన్ మర్క్రమ్ సేన భారత్‌కు దాసోహమైంది. దాంతో, తొలిసారి ఐసీసీ ట్రోఫీ ముద్దాడే అవకాశాన్ని కోల్పోయింది.