Sharad Pawar : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఓ వైపు ఎన్డీఏ కూటమి, ఇంకోవైపు ఇండియా కూటమి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అయితే ఎన్నికలకు వెళ్లే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై NCP-SCP నాయకుడు శరద్ పవార్ మాట్లాడుతూ.. తమ పార్టీలో ఎవరికీ సీఎం పదవిపై ఆసక్తిలేదని తేల్చేశారు.
రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని తాము భావిస్తున్నామని, మార్పు రావాలని కోరుకుంటున్నామని, కాబట్టి సీఎం ఎవరు అవుతారన్నది తమకు అంత ముఖ్యమైన విషయం కాదని పవార్ అన్నారు. ఇక ఉద్ధవ్ థాకరే కూడా ఇటీవల స్పందిస్తూ ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా అభ్యంతరం లేదని, తాము సపోర్టు చేస్తామని చెప్పారు. మొత్తానికి ఇండియా కూటమిలో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఏడాది చివరిలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే ఉద్ధవ్ థాకరే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కలిసి వచ్చారు. సీట్ల పంపకాలపై చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే తమ లక్ష్యమని శరద్ పవార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో మార్పు జరగగానే సుపరిపాలన అందిస్తామని పవార్ చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అన్నారు. ఎంఐఎం కూడా ఇండియా కూటమిలో చేరేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ముస్లిం ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో మజ్లి్స్ సపోర్టుతో ఇండియా కూటమి పోటీ చేయబోతోంది. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు రాబట్టింది. అదే జోష్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది.