BAN vs SA 1st Test : ఆసియా ఖండంలో తేలిపోయే దక్షిణాఫ్రికా (South Africa) జట్టు చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ ఫార్మాట్లో 10 ఏండ్ల తర్వాత తొలి విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మిర్పూర్ టెస్టులో తొలి రోజే పట్టు బిగించిన సఫారీలు.. నాలుగో రోజు ఆటను ముగించారు. స్వదేశంలో బెబ్బులిలా గర్జించే బంగ్లాదేశ్ బ్యాటర్లకు కగిసో రబడ(3/26, 6/36), కేశవ్ మహరాజ్(3//34, 3/105) లు పగ్గాలు వేయగా.. 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీ జట్టు 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చిరస్మరణీయ విజయంతో ఎడెన్ మర్కరమ్ సేన రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత పర్యటనలో టెస్టు, టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన బంగ్లాదేశ్‌కు సొంతగడ్డపైనా ఓటమి తప్పలేదు. మిర్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లా భారీ తేడాతో ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో దీటుగా ఆడింది. సఫారీ పేసర్ రబడ(636) ధాటికి టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(97) అసమాన పోరాటం కనబరిచాడు. జకీర్ అలీ(58)తో పాటు టెయిలెండర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. సెంచరీ కొట్టేలా కనిపించిన మిరాజ్‌ను రబడ వెనక్కి పంపాడు.
South Africa’s first Test win in Asia since 2014 🙌https://t.co/8YYOAEQ8fx #BANvSA pic.twitter.com/Gq7mo9Rtvm
— ESPNcricinfo (@ESPNcricinfo) October 24, 2024
మరో ఎండ్‌లో కేశవ్ మహరాజ్(3/105) సైతం విజృంభించగా బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం 105 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా ధనాధన్ ఆడింది. ఓపెనర్లు టోనీ జోర్జి(40), ఎడెన్ మర్క్రమ్(20)లు శుభారంభం ఇచ్చారు. ఈ ఇద్దరని తైజుల్ ఇస్లాం ఔట్ చేసి బంగ్లాకు బ్రేకిచ్చాడు. అయితే.. ట్రిస్టన్ స్టబ్స్(30 నాటౌట్), డెవిడ్ బడంగ్హమ్(12)లు సమయోచితంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత శతకంతో జట్టును ఆదుకున్న కైలి వెరెనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.