సోమవారం 18 జనవరి 2021
Sports - Nov 23, 2020 , 12:39:44

రెజ్లింగ్‌కు అండ‌ర్‌టేక‌ర్ గుడ్‌బై

రెజ్లింగ్‌కు అండ‌ర్‌టేక‌ర్ గుడ్‌బై

ది అండ‌ర్‌టేక‌ర్‌.. 30 ఏళ్లుగా వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో ఓ సంచ‌ల‌నంగా మారిన‌ ఈ పేరు ఇక వినిపించ‌దు. చూడ‌గానే భీతిగొలిపే ఆ ఆకారం, రింగ్‌లోకి న‌డిచి వ‌చ్చే ఆ తీరు, గెల‌వ‌గానే చేసే ఆ విన్యాసం ఇక క‌నిపించ‌వు. ఆల్‌టైమ్ గ్రేట్ రెజ్ల‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచిన ది అండ‌ర్‌టేక‌ర్ ఇక తాను గేమ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్ వ‌చ్చేసింద‌ని చెప్పేశాడు. స‌ర్వైవ‌ర్ సిరీస్‌లో అత‌ని స‌మ‌కాలీన లెజెండ‌రీ రెజ్ల‌ర్లంతా క‌లిసి అత‌నికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. 30 ఏళ్లుగా ఈ రింగ్‌లోకి మెల్ల‌గా న‌డుచుకుంటూ వ‌చ్చి ఎంతో మంది ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపాను. ఇక ఇప్పుడు నేను వీడ్కోలు చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. ఈ ది అండ‌ర్‌టేక‌ర్‌ను ఇక ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వండి అని త‌న రిటైర్మెంట్ స్పీచ్‌లో అండ‌ర్‌టేక‌ర్ అన్నాడు. 

గ‌త జూన్‌లోనే తాను రిటైరవుతున్న‌ట్లు అత‌డు ప్ర‌క‌టించాడు. స‌ర్వైవ‌ర్ సిరీస్‌లో రోమ‌న్ రీన్స్‌, డ్రూ మెకింటైర్ మ్యాచ్ త‌ర్వాత డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ లెజెండ్స్ అంద‌రూ క‌లిసి వ‌చ్చి అండ‌ర్‌టేక‌ర్‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. షేన్ మెక్‌మ‌హ‌న్‌, బిగ్ షో, జేబీఎల్‌, జెఫ్ హార్డీ, మిక్ ఫోలీ, ది గాడ్‌ఫాద‌ర్‌, ది గాడ్విన్స్‌, సేవియో వెగా, రికిషి, కెవిన్ నాష్‌, బుక్ టీ, షాన్ మైకేల్స్‌, రిక్ ఫ్లెయిర్‌, ట్రిపుల్ హెచ్‌, కేన్ లాంటి లెజెండ్స్ అంద‌రూ రింగ్‌లోకి వ‌చ్చి అండ‌ర్‌టేక‌ర్ కెరీర్‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. అండ‌ర్‌టేక‌ర్ అస‌లు పేరు మార్క్ కాల్వే. అత‌డు 1990లో రెజ్లింగ్‌లోకి వ‌చ్చాడు.