Tejashwi Yadav | వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం టీమ్ఇండియా (Team India) జట్టును దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan)కు పంపకూడదన్న బీసీసీఐ (BCCI) నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు. భారత నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయాలను, క్రీడలను కలిపి చూడటం సరికాదని హితవుపలికారు.
2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాకిస్థాన్ పర్యటనను ప్రస్తావిస్తూ.. ‘2015లో నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధానితో కలిసి బిర్యానీ తిన్నారు. మోదీ పర్యటనకు లేని అభ్యంతరం.. టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లడానికి ఎందుకు వచ్చింది..? క్రీడల్లో రాజకీయాల జోక్యం మంచిది కాదు. క్రీడలను, రాజకీయాలను కలిపి చూడడం తగదు. మనం వెళ్లాలి.. ఇతర జట్లూ రావాలి. ఒలింపిక్స్ విషయంలోనూ ఇలానే చేస్తారా..? భారత జట్టు పాక్‌కు ఎందుకు వెళ్లకూడదు..? అందుకున్న అభ్యంతరమేంటి..? ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లి బిర్యానీ తినడం మంచి విషయం.. కానీ, భారత జట్టు క్రికెట్ ఆడేందుకు వెళ్తే మాత్రం తప్పుగా భావిస్తారు..’ అని తేజస్వీయాదవ్ ప్రశ్నించారు.
పాకిస్థాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆ దేశంలో జరుగుతుందా? ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి వెళ్లబోమని, హైబ్రిడ్ మోడల్ అయితేనే ఆడతామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇది వరకే తన నిర్ణయాన్ని స్పష్టం చేయగా మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందుకు ససేమిరా అంగీకరించడం లేదు. టీమ్ఇండియా పాక్‌కు రావాల్సిందేనని పట్టుబడుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ తమ దేశానికి రాకుంటే తామూ ఇకపై ఆ దేశంలో జరిగే ఐసీసీ ఈవెంట్లకు వెళ్లేది లేదని పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ గురువారం తెలిపారు. ‘భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీలు ఆడేందుకు మేం వెళ్తున్నాం. కానీ వాళ్లు ఇక్కడకు రాకపోవడం ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ భారత్ అదే పద్ధతిని కొనసాగిస్తే భవిష్యత్‌లో భారత్‌లో జరిగే టోర్నీలకు మేమూ జట్టును పంపబోమ’ని స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జై షా.. బీసీసీఐ సెక్రటరీగా కాకుండా ప్రపంచ క్రికెట్ ప్రయోజనాల కోసం పనిచేయాలని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు.
Also Read..
Glenn Phillips: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో
Shubman Gill: శుభమన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్.. రెండో టెస్టుకు రెఢీ !
Cardiac Arrest: గుండెపోటుతో మైదానంలోనే క్రికెటర్ మృతి.. వీడియో