Pune Test : సొంతగడ్డపై భారత జట్టు 12 ఏండ్ల జైత్రయాత్రకు న్యూజిలాండ్ చెక్ పెట్టింది. సుదీర్ఘ ఫార్మాట్లో వరుసగా 18 సిరీస్ విజయాలతో రికార్డు సృష్టించిన టీమిండియా (Team India)కు కివీస్ ఊహించని షాకిచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వ్యూహం మనోళ్లు పన్నితే విజయం మాత్రం ప్రత్యర్థికి సొంతమైంది. స్వదేశంలో బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలను ఓడించిన భారత్‌ను న్యూజిలాండ్ ఇప్పట్లో కోలుకోలేని విధంగా గట్టి దెబ్బ కొట్టింది.
టర్నింగ్ పిచ్ మీద ఎలా ఆడాలో చూపిస్తూ.. టీమిండియాపై 113 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. బౌలర్లు రాణించినప్పటికీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్‌ల వైఫల్యం జట్టు కొంపముంచింది. ప్రత్యర్థి పన్నిన వలలో పడిన రోహిత్ సేన చెత్త ఆటతో తీవ్రంగా నిరాశపరిచింది. బెంగళూరులో ఓటమినే ఇంకా మర్చిపోని అభిమానులను ఇప్పుడు పుణేలో దారుణ పరాభవం మరింత కుంగదీస్తోంది.
Bengaluru✅
Pune ✅Back-to-back Test wins in India for New Zealand 👏https://t.co/3D1D83IgS1 #INDvNZ pic.twitter.com/8usbNfzMzF
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కాన్పూర్‌లో బజ్‌బాల్‌ను తలదన్నే ఆటతో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత జట్టు భీకర ఫామ్‌లో ఉంది. కివీస్ ఏమో శ్రీలంక చేతిలో వైట్‌వాష్‌కు గురైన బాధతో టీమిండియాకు వచ్చింది. కానీ, రెండు వారాల్లోనే అంతా తలకిందులైంది. భారత జట్టుపై సంపూర్ణ ఆధిపత్యంతో కివీస్ సిరీస్ కైవసం చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ను సరిగా అంచనా వేయని రోహిత్ శర్మ భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. మ్యాట్ హెన్రీ(5/15), విలియం ఓ రూర్కీ(4/22) నిప్పులు చెరగడంతో ఐదుగురు డకౌట్ అయ్యారు.
వరల్డ్ క్లాస్ బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం కొత్త కుర్రాళ్లలా వికెట్ పారేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్(150), రిషభ్ పంత్(93), కోహ్లీ(70) అద్బుతంగా ఆడినా సరే కివీస్ బౌలర్లు పట్టువిడువకుండా అదిరే విజయాన్ని అందించారు.
Alhamdulillah 😊❤️
Proud to play for the country 🇮🇳 pic.twitter.com/GwG8heHEsc— sarfaraz khan (@sarfarazkhan977) February 18, 2024
దాంతో.. సిరీస్ సమం చేయాలంటే స్పిన్ పిచ్ ఒక్కటే మార్గమని పుణేలో టర్నింగ్ పిచ్ సిద్ధం చేసుకున్న టీమిండియాకు మళ్లీ ఓటమే ఎదురైంది. వాషింగ్టన్ సుందర్ (7/59) తిప్పేయడంతో తొలి రోజు ప్రత్యర్థిని 259కే కట్టడి చేసిన రోహిత్ సేన.. అనంతరం 156 పరుగులకే చాప చుట్టేసింది. రోహిత్ శర్మ రెండో ఓవర్లోనే డకౌట్ కాగా.. అనుభవజ్జుడైన కోహ్లీ ఫుల్‌టాస్ ఆడలేక సాంట్నర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
ఇక మిడిలార్డర్లో పంత్, సర్ఫరాజ్‌లు ఈసారి సాంట్నర్ స్పిన్‌కు సమాధానం చెప్పలేకపోయారు. కానీ.. మనోళ్లు పరుగులు చేసేందుకు అష్టకష్టలు పడ్డ చోట కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్(86) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. స్వీప్ షాట్లే ఆయుధంగా అశ్విన్, సుందర్‌లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వచ్చిన బ్లండెల్(41), ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్(48 నాటౌట్)లు అవలీలగా రన్స్ సాధించారు. దాంతో, రెండో ఇన్నింగ్స్‌లో లాథమ్ బృందం 255 పరుగులకు ఆలౌటయ్యింది.
Like this tweet if you want Virat Kohli to retire ASAP. #INDvsNZ #INDvsNZTEST #ViratKohli #RohitSharma pic.twitter.com/nIPFm5jLDC
— Ashwani Kr. (@OyeAshwani) October 26, 2024
ప్రత్యర్థి నిర్దేశించిన 359 పరుగుల ఛేదనలో మళ్లీ అదే తడబాటుతో భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. యశస్వీ జైస్వాల్(77) అర్ధ శతకంతో పోరాడినా.. కోహ్లీ, సర్ఫరాజ్ సాంట్నర్(6/104)పై పైచేయి సాధించలేక వికెట్ ఇచ్చేశారు. 166 పరుగులకే ఏడు వికెట్లు పడడంతో ఓటమి ఖరారైపోయింది. కాకపోతే జడేజా(42) కాసేపు ప్రతిఘటించి ఫలితాన్ని ఆలస్యం చేశాడంతే.
అలాకాకుండా.. టాపార్డర్‌లో రోహిత్ శర్మ అటాకింగ్ గేమ్ ఆడి శుభారంభం ఇచ్చి ఉంటే.. మిడిలార్డర్లో కోహ్లీ భారీ స్కోర్ చేసి ఉంటే ఈరోజు పుణేలో టీమిండియా జయకేతనం ఎగురవేసేది. కానీ.. ఒత్తిడికి లోనైన భారత బ్యాటర్లు కివీస్ స్పిన్‌కు దాసోహమై సిరీస్ ఓటమికి బాధ్యులయ్యారు. ఈ రెండు ఓటములతోనైనా టీమిండియా బ్యాటర్లు పాఠాలు నేర్వాలి. లేదంటే నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరుగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హ్యాట్రిక్ విజయం అసాధ్యమే కానుంది.
పిచ్ ఎలాంటిదైనా సరే మేము చెలరేగగలం అని చాటుతూ పుష్కర కాలంలో ఏ జట్టుకు సాధ్యంకాని విధంగా న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను తన్నుకుపోయింది. చిన్నస్వామి స్టేడియంలో పేస్‌తో.. పుణేలో స్పిన్‌తో భారత్ బ్యాటర్లకు కళ్లెం వేసిన న్యూజిలాండ్ చిరస్మరణీయ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలిచింది. వరుసగా రెండో గెలుపుతో డబ్ల్యూటీసీ పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటికైతే భారత్ అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఫలితంపై.. ఇతర జట్ల ప్రదర్శనపై ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
New Zealand stir up the race to the #WTC25 Final with a historic win over India in Pune 👀 #INDvNZ | Read on 👇https://t.co/0QYbooJJlB
— ICC (@ICC) October 26, 2024