IND vs NZ 2nd Test : ముచ్చటగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలనుకున్న భారత జట్టు (Team India)కు ఘోర పరాభవం ఎదురైంది. సొంతగడ్డపై వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయంతో జోరుమీదున్న టీమిండియా రికార్డుకు కివీస్ అడ్డుకట్ట వేసింది. బెంగళూరు టెస్టులో 46కే ఆలౌట్ అయిన టీమిండియా ఈసారి టర్నింగ్ పిచ్ మీద 156 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లోనైనా పోరాడి సిరీస్ సమం చేస్తుందనుకుంటే.. 245 పరుగులకే చాప చుట్టేసింది. స్వదేశంలో స్పిన్ ఉచ్చుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించే భారత్.. ఈసారి అదే అస్త్రానికి తలవంచి సిరీస్‌ను న్యూజిలాండ్‌కు అప్పగించేసింది.
ప్రధాన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. మిచెల్ సాంట్నర్(6,/106) సంచలన బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను విజయం వాకిట నిలిపాడు. ఒంటరి పోరాటం చేసినా రవీంద్ర జడేజా(42) .. అజాజ్ పటేల్ ఓవర్లో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద సౌథీకి దొరికాడు. అంతే.. న్యూజిలాండ్ ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. దాంతో, మరో టెస్టు ఉండగానే కివీస్ సిరీస్ కైవసం చేసుకుంది.
A rare reversal for India at home! #INDvNZ pic.twitter.com/DM1DTjBWl0
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024
ఓవర్‌నైట్ స్కోర్ 198-5తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ను జడేజా దెబ్బ కొట్టాడు. టామ్ బ్లండెల్ (41)ను ఔట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. సాంట్నర్(4), అజాజ్ పటేల్(1)లను జడ్డూ ఔట్ చేయడంతో కివీస్ 255 పరుగులకు ఆలౌటయ్యింది. సిరీస్‌లో నిలవాలంటే పోరాడాల్సిన చోట భారత బ్యాటర్లు మళ్లీ అదే తడబాటును కొనసాగించారు. మిచెల్ సాంట్నర్(6/106)ను ఎదుర్కోలేక వరుసగా డగౌట్ చేరారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(77) హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(17), పంత్(0), సర్ఫరాజ్ ఖాన్(9)లు తీవ్రంగా నిరాశపరిచారు.
HISTORY! New Zealand achieve their first ever Test series win in India 🙌
They end India’s record streak of 18 consecutive home series wins, becoming the first away team to win a men’s Test series in India since England in 2012-13 #INDvNZ pic.twitter.com/YxqceWEqQC
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024
ప్రధాన ఆటగాళ్లంతా పెవిలియన్ చేరినాఅశ్విన్(18)తో కలిసి రవీంద్ర జడేజా(42) కివీస్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. ఈ జోడీ చక్కగా ఆడుతూ ఆశలు రేపింది. అయితే.. సాంట్నర్ ఊరించే బంతితో అశ్విన్ ఆట కట్టించాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్(1) అండగా జడ్డూ 23 పరుగులు జోడించాడు.
A tough loss for #TeamIndia in Pune.
Scorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/PlU9iJpGih
— BCCI (@BCCI) October 26, 2024
అయితే.. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడిన ఆకాశ్.. మిడాన్‌లో రవీంద్ర చేతికి చిక్కాడు. బుమ్రా కాసేపు మెరుపులు మెరిపించినా.. అజాజ్ బౌలింగ్‌లో జడేజా భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద సౌథీకి క్యాచ్ ఇచ్చాడు. అంతే.. 245 వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు స్వదేశంలో భారత్‌పై సిరీస్ విజయం సాధించిన ఆనందం పట్టలేక గెలుపు సంబురాలు చేసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో సాంట్నర్ (7/53) తిప్పేయగా ఏ ఒక్కరూ క్రీజులో నిలబడలేకపోయారు. రెండో రోజు తొలి సెషన్లోనే శుభ్‌మన్ గిల్(30) వికెట్ తీసిన సాంట్నర్.. ఆ కాసేపటికే విరాట్ కోహ్లీ(1)ను ఫుల్‌టాస్‌తో బౌల్డ్ చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే కుదురుకున్న యశస్వీ జైస్వాల్(30)ను గ్లెన్ ఫిలిఫ్స్ బోల్తా కొట్టించాడు.
New Zealand take an unassailable 2-0 lead as India lose their first Test series at home since 2012.#WTC25 | #INDvNZ 📝: https://t.co/Kl7qRDguyN pic.twitter.com/ASXLeqArG7
— ICC (@ICC) October 26, 2024
అంతే.. అక్కడితో భారత ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. రిషభ్ పంత్(18), సర్ఫరాజ్ ఖాన్(11)లు ధాటిగా ఆడబోయి ఔటయ్యారు. అయితే.. టీమిండియా 150 కొట్టిందంటే అదంతా రవీంద్ర జడేజా(38), వాషింగ్టన్ సుందర్(18)ల చలవే. ఇప్పటివరకూ టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కూడా తీయని సాంట్నర్.. పుణే పిచ్ పుణ్యమాని అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.