Team India : క్రికెట్ సమిష్టి ఆట. ఏ ఒక్కరో ఇద్దరో రాణిస్తే ప్రతిసారి మ్యాచ్‌లు గెలవలేం. ముఖ్యంగా టెస్టుల్లో తలా కొన్ని రన్స్ చేస్తే ప్రత్యర్థిని దెబ్బ కొట్టవచ్చు. అందుకే.. టాపార్డర్, మిడిలార్డర్‌కు అండగా కొన్ని పరుగులు చేయాల్సిన బాధ్యత లోయర్ ఆర్డర్ (Lower Order) తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, అన్ని జట్ల టెయిలెండర్లు గొప్పగా రాణిస్తుంటే భారత తోక బ్యాటర్లు మాత్రం నిరాశపరుస్తున్నారు. అండర్సన్ – టెండూల్కర్ (Anderson -Tendulkar) ట్రోఫీలో మన లోయర్ ఆర్డర్ మరీ దారుణంగా ఆడుతోంది. ఇంగ్లండ్ టెయిలెండర్లు మన పేసర్లను అలవోకగా ఎదుర్కొంటూ జట్టును ఆదుకుంటుంటే వీళ్లు క్రీజులోకి ఇలా వచ్చి అలా వెళ్లుతున్నారు. ఒక్క లార్డ్స్ టెస్టులో తప్ప మిగతా మూడింటిలో.. ఇప్పుడు ఓవల్‌లోనూ టెయిలెండర్లుల గొప్పగా రాణించింది లేదు. ఫలితంగా.. కొన్నేళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సేన వెనకబడింది.
ఇంగ్లండ్ పర్యటనతో మరోసారి భారత జట్టు టెయిలెండర్ల బ్యాటింగ్ వైఫల్యం బయటపడింది. ప్రధాన బ్యాటర్ల పోరాటానికి మద్దుతుగా తలా పది పరుగులైనా చేయలేకపోతున్నారు. ఈ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఓవల్ టెస్టులో కరుణ్ నాయర్(57) అర్ధ శతకంతో ఆదుకోగా.. రెండో రోజు తొలి సెషన్లో 34 బంతుల్లో.. 6 పరుగులకే చివరి నాలుగు వికెట్లు పడ్డాయి. దాంతో, మూడొందల స్కోర్ చేస్తుందనుకున్న టీమిండియా 224కే ఆలౌటయ్యింది.
India add just 20 runs to their overnight total as Gus Atkinson completes a comeback five-wicket haul! https://t.co/rrZF1qfeQq #ENGvIND pic.twitter.com/Z2luob8oxf
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2025
అండర్సన్ టెండూల్కర్ సిరీస్‌లో మొదటిదైన లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పట్టుబిగించినట్టే బిగించి.. మ్యాచ్‌ను స్టోక్స్ సేనకు అప్పగించేసింది. టాపార్డర్ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్(101), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(147), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(134)లు సెంచరీతో చెలరేగి భారీ స్కోర్‌కు బాటలు వేశారు. కానీ, టెయిలెండర్లను చుట్టేసిన ఇంగ్లండ్ పేసర్లు టీమిండియాను 500లోపే ఆలౌట్ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, పంత్ శతకాలు సాధించినా.. లోయర్ ఆర్డర్లో ముగ్గురు డకౌట్ అయ్యారు. దాంతో.. 364కే భారత ఇన్నింగ్స్ ముగిసింది. రెండో టెస్టుకు వేదికైన బర్మింగ్హమ్లోనూ అదే పరిస్థితి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు సెంచరీలతో కదం తొక్కినా.. టెయిలెండర్లు నిలువలేదు. టాపార్డర్ జోరుతో అలవోకగా 600 కొడుతుందనుకున్న టీమిండియా.. 587కే కుప్పకూలింది.
అయినా.. సిరాజ్, ఆకాశ్ దీప్‌లు ఆరేసి వికెట్లతో రాణించగా గిల్ బృందం చిరస్మరణీయ విజయం సాధించింది. లార్డ్స్ టెస్టులోనూ లోయర్ ఆర్డర్ ఆట మారలేదు. బుమ్రా, సిరాజ్ సున్నాకే పెవిలియన్ చేరారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలమైనా.. తోక బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. కానీ, బషీర్ ఓవర్లో సిరాజ్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలుపొందింది. మాంచెస్టర్ టెస్టులో ఓపెనర్లు శుభారంభం ఇవ్వగా.. మిడిలార్డర్ పోరాటంతో నాలుగొందలకు పైగా చేసేలా కనిపించింది టీమిండియా. కానీ.. అన్షుల్ కంభోజ్ డకౌట్ కాగా.. బుమ్రా 4, సిరాజ్ 5కే డగౌట్ చేరగా.. 358కే పరిమితమైంది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో గిల్, రాహుల్ అసమాన పోరాటానికి సుందర్, జడేజాల అజేయ శతకాలు తోడవ్వగా మ్యాచ్ డ్రాగా ముగిసింది.