Election Commission | ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న వరుస ప్రకటనలపై ఈసీ స్పందించింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. బాధ్యతా రహితమైన, నిరాధారమైన ప్రకటలను పట్టించుకోవద్దని.. పారదర్శకంగా తమ విధులను కొనసాగించాలని ఈసీ అధికారులను కోరింది. ప్రస్తుతం ఇలాంటి ఆరోపణలు ప్రతిరోజూ వస్తున్నాయని.. వాటికి బలమైన ఆధారాలు లేవని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆయా ఆరోపణల ప్రభావం పడకుండా నిజాయితీగా ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని సూచించింది. పారదర్శకంగా, విశ్వసనీయ ఎన్నికలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశంలో ఓట్ల చౌర్యం జరుగుతుందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం తగ్గుతోందన్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. జుల 23న రాహుల్ గాంధీ భారత్ ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరుగుతోందని ఆరోపించారు. కర్నాటకలోని ఓ లోక్సభ స్థానాన్ని తమ పార్టీ లోతుగా అధ్యయనం చేసిసి, ఓట్ల చౌర్యం ప్రక్రియను గుర్తించినట్లు తెలిపారు. కర్నాటకలో ఓ లోక్సభ స్థానాన్ని ఎంచుకొని జాబితాను డిజిటల్ ఫార్మాట్లోకి మార్చామని.. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ఆరు నెలల సమయం పట్టిందన్నారు. ఆ తర్వాత ఓట్ల చౌర్యం ఎలా జరుగుతుంది.. ఎవరు చేస్తారు.. కొత్త ఓటర్లను ఎక్కడి నుంచి తీసుకువస్తారనే విషయాలను తాము అర్థం చేసుకున్నామన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రజల ఎదుట, ఈసీ ముందు బహిర్గతం చేస్తామన్నారు.