FRS Servor | పాపన్నపేట, ఆగస్టు 1 : వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ ( ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం) ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టైం విధించినట్లు వివిధ గ్రూపుల్లో మెసేజేస్ వైరల్ అయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ చేసుకోవడానికి పోటీపడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నెట్వర్క్ సరిగా ఉండకపోవడంతో రిజిస్ట్రేషన్లు కాలేకపోయాయి.
అంతేకాకుండా సమయం మధ్యాహ్నం 3 గంటల వరకే అని ప్రకటనలు రావడంతో ఉపాధ్యాయులు ఒక దశలో ఆందోళనకు గురయ్యారు. వివిధ గ్రామాల్లో సర్వర్ బిజీగా ఉండడంతో పలువురు ఉపాధ్యాయులకు రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో గడువు ముగుస్తుందని ఒక దశలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నo 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలంటూ వార్తలు చక్కర్లు కొట్టడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉపాధ్యాయులు ఉండిపోయారు.
కేవలం పాపన్నపేట మండలంలోనే సుమారు 260 మంది వరకు ఉపాధ్యాయులు ఉండగా ఇందులో కేవలం 40 శాతం మంది ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్లు అయినట్లు సమాచారం. అయితే పాపన్నపేట ఉన్నత పాఠశాలలో సుమారు 21 మంది ఉపాధ్యాయులు ఉండగా సాయంత్రం నాలుగు గంటల వరకు కేవలం ఐదుగురివి మాత్రమే రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసింది. అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇటీవల డిప్యూటేషన్‌పై వెళ్లిన వారివి ఆయా పాఠశాలల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిబంధన విధించడంతో వారు కూడా రిజిస్ట్రేషన్లు సరిగా చేసుకోలేకపోయారు. అయితే అధికారులు ఇష్టానుసారంగా ఆదేశాలు ఇవ్వకుండా, కొంత గడువు విధిస్తే ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పిఆర్టియు మండల శాఖ అధ్యక్షుడు పంతులు రాజు అభిప్రాయపడ్డారు.