Team India : టీ20 వరల్డ్ కప్ విజేతగా ఆసియా దేశం శ్రీలంక వెళ్లిన భారత జట్టు (Team India) ఘోరమైన ఓటమి చవిచూసింది. పొట్టి సిరీస్‌లో లంకను వైట్‌వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌లో తేలిపోయింది. వన్డే వరల్డ్ కప్, పొట్టి ప్రపంచ కప్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికేసిన భారత హిట్టర్లు లంక స్పిన్నర్లకు దాసోహమయ్యారు. దాంతో, స్పిన్ ఆడడంలో భారత ఆటగాళ్ల వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్టు కనపడింది.
కొన్ని ఏండ్లుగా స్పిన్ అస్త్రంగా ప్రత్యర్థులను వణికించిన ఇండియా.. ఇప్పుడు అదే ఉచ్చులో పడి కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ టెన్ డాస్చేట్ (Ten Doeschate) తన వ్యూహాలకు పదును పెడుతున్నాడు.
ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌తో టెన్ డాస్చేట్

స్వదేశంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లతో సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉన్నందున భారత క్రికెటర్లను స్పిన్ సమర్థంగా ఎదుర్కొనేలా చేయడంపై ఫోకస్ పెట్టనున్నాడు. ‘విదేశీ పిచ్‌లపై చెలరేగడంపై దృష్టి పెట్టిన భారత క్రికెటర్లు.. స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కోలేక పోతున్నారు. భారత జట్టు కోచ్‌గా నేను అసలు ఊహించని చాలెంజ్ ఇది. శ్రీలంక పర్యటనతోనే స్పిన్ సమస్య తీరలేదు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో బాగా ఆడడంపై భారత ఆటగాళ్లు దృష్టి ఉందని నేను అనుకుంటున్నా. స్పిన్ చక్కగా ఆడడం ఎప్పుడూ ఇండియన్స్‌కు బలం అయ్యేది. కానీ, ఇప్పుడు అలా లేదు. అందుకని భారత క్రికెటర్లను ప్రపంచంలోనే స్పిన్ సమర్ధంగా ఎదుర్కొనేలా చేయడమనే నా ముందున్న సవాల్’ అని డస్చేట్ తెలిపాడు.
నిరుడు శ్రీలంక గడ్డపైనే ఆసియా కప్ కొల్లగొట్టిన భారత జట్టు ఈసారి జోరు చూపలేకపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఐపీఎల్ స్టార్ శివం దూబేలతో కూడిన బలమైన భారత బ్యాటింగ్ లైనప్ లంక స్పిన్నర్ల ధాటికి కుదేలైంది. అసలు స్పిన్ ఆడడమే మర్చిపోయినట్టు ఒక్కొక్కరూ పెవలియన్ చేరగా.. 27 ఏండ్ల తర్వాత టీమిండయాపై లంక ఓ ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకుంది.

కెప్టెన్ రోహిత్ అర్ద శతకంతో చెలరేగినా లంక సారథి చరిత అసలంక(3/30) విజృంభణతో అనూహ్యంగా తొలి వన్డే టైగా ముగిసింది. ఇక రెండో వన్డేలో జెఫ్రీ వాండర్స్(6/33) స్పిన్ మాయాజాలంతో దెబ్బ కొట్టాడు. భారత టాపార్డర్‌ను వణికించిన అతడు తొలి ఆరు వికెట్లు తీసి ఓటమి అంచున నిలిపాడు. ఇక నిర్ణయాత్మకమైన మూడో వన్డేలోనూ లంకదే పైచేయి అయింది. వెల్లలాగే(5/27), కెప్టెన్ చరిత అసలంకలు తిప్పేయడంతో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో.. రోహిత్ సేన ఘోర పరాభవం మూటగట్టుకుంది.