PR Sreejesh : ఒలింపిక్ విజేతగా హాకీకి వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేష్ (PR Sreejesh)పై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే హాకీ ఇండియా (Hockey India) రూ.5 లక్షలు ప్రకటించగా.. కేరళ ప్రభుత్వం ఏకంగా రూ.2 కోట్లు ఇస్తామని చెప్పింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) నేతృత్వంలోనే జరిగిన కాబినేట్ భేటీలో శ్రీజేష్‌కు రూ.2 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
‘పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుపొందిన భారత హాకీ జట్టులో సభ్యుడైన పీఆర్ శ్రీజేష్‌కు రూ.2 కోట్ల క్యాష్ రివార్డు ఇవ్వనున్నాం’ అని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నాలుగేండ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాక శ్రీజేష్‌కు కేరళ గవర్నమెంట్ రూ.2 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అతడిని అంతే ప్రైజ్‌మనీతో సత్కరించనుంది.
శ్రీజేష్ను భుజాలపై మోస్తున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్
భారత హాకీ లెజెండ్‌గా పేరొందని శ్రీజేష్ పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) తర్వాత సుదీర్ఘ కెరీర్‌ను ముగించిన విషయం తెలిసిందే. హాకీకి వీడ్కోలు పలికిన శ్రీజేష్ కోచ్‌గా దర్శనమివ్వనున్నాడు. అయితే.. 2-3 నెలల విరామం తర్వాత భారత పురుషుల జూనియర్ హాకీ జట్టుకు కోచ్‌గా అతడు బాధ్యతలు స్వీకరించనున్నాడు.
ప్రపంచస్థాయి గోల్‌కీపర్‌గా ఎదిగిన శ్రీజేష్ కేరళలోని ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నా సరే హాకీ ఆడాలనే కల కన్నాడు. అలా 2006లో హాకీలో అరంగేట్రం చేసిన శ్రీజేష్ తన 18 ఏండ్ల కెరీర్లో భారత జట్టు ఎన్నో చిరస్మణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడిన అతడు.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో శ్రీజేష్ కల నిజం చేసుకున్నాడు.
రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా శ్రీజేష్ తన తండ్రి త్యాగాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘మా నాన్న ఆవును అమ్మేసి నాకు మొదటి హాకీ కిట్ కొనిచ్చాడు. ఆ విషయాన్ని నేను ఇంకా మర్చిపోలేదు. ఆయన త్యాగం నాలో విజయ కాంక్షను రగిల్చింది. కష్టాలను అధిగమించడం, పెద్ద కలలు కనడం నేర్పించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో నా కల నెరవేరింది. ఆక్షణం మేము చేసుకున్న సంబురాలు.. అందరం కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు నాకు ఎంతో విలువైనవి’ అని శ్రీజేష్ తెలిపాడు.