సిటీబ్యూరో,ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : కొత్తగా అభివృద్ధి చెందుతున్న జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)పై దేశ వ్యాప్తంగా కోటి మంది మహిళలకు శిక్షణనివ్వడమే లక్ష్యంగా సౌత్ ఏసియన్ ఉమెన్ ఇన్ టెక్ సంస్థ కార్యాచరణ సిద్ధం చేసింది. స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్, హైదరాబాద్ సాప్ట్వేర్ ఎంటర్ప్రైన్యూర్స్ అసోసియేషన్(హైసియా)లతో కలిసి జెన్ ఏఐపై మహిళలకు వృత్తి పరమైన నైపుణ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీ హబ్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ శిక్షణ ద్వారా దేశ సాంకేతిక, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు అవసరమైన నైపుణ్యం మహిళలకు వస్తుందని టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు.
ఏఐ సాంకేతిక పరిజ్ఞానంలో మహిళలకు సముచిత కల్పించడం ద్వారా సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు రావడంతో పాటు మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. దేశంలోని డిజిటల్ టాలెంట్‌లో 13-14 శాతంతో హైదరాబాద్ 4వ స్థానంలో ఉందని, ఇది సౌత్ ఏసియన్ ఉమెన్ ఇన్ టెక్ చొరవ వల్ల సాధ్యమైందన్నారు. మహిళల్లో ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్ స్టార్టప్, కార్పొరేట్ ఐటీ సంస్థలో మహిళలు కీలక పాత్రను పోషించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు సౌత్ ఏసియన్ ఉమెన్ ఇన్ టెక్ సంస్థ దేశంలోని ఇతర నగరాల్లోని మహిళలకు శిక్షణ నిచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ఆ సంస్థ ముందుకు వెళుతోందని తెలిపారు.