Dinner | రాత్రి పూట తినే ఆహారం అత్యంత పోషకాలను కలిగి ఉండాలి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో, శరీర మరమ్మత్తు ప్రక్రియను మెరుగుపరచడంలో, మెటబాలిజాన్ని నియంత్రించడంలో, మరుసటి రోజుకు స్థిరమైన శక్తిని అందించడంలో, యాసిడ్ రిఫ్లెక్స్ ను తగ్గించడంలో, నిద్రకు తోడ్పడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. చాలా మంది రాత్రి పూట తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. రాత్రి తినే భోజనంపై ఎక్కువ శ్రద్ద చూపిస్తూ ఉంటారు. అయితే రాత్రిపూట మనం తీసుకునే ఆహారంపై ఎంత శ్రద్ద చూపిస్తామో దాన్ని తీసుకునే సమయంపై కూడా అంతే శ్రద్ద చూపించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం 6 నుండి 8 గంటల మధ్యలో తీసుకోవాలి. మనం నిద్రించడానికి 2 నుండి 3 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది మన శరీర సహజ గడియారంపై మంచి ఫ్రభావం చూపుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
రాత్రి భోజనం త్వరగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. మెటబాలిజం మెరుగుపడుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. రాత్రి త్వరగా తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఇన్సులిన్ స్పందన తగ్గుతుంది. శరీరం కార్బొహైడ్రేట్ లను సమర్థవంతంగా ప్రాసెస్ చేయలేకపోతుంది. దీని వల్ల రాత్రంతా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అలాగే సహజంగానే 12 నుండి 14 గంటల ఉపవాసం లభిస్తుంది. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాభాలను అందిస్తుంది. ప్రీడయాబెటిక్, డయాబెటిస్ తో బాధపడే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక మెటబాలిజం పగటిపూట ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో శరీరం ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకునే సమయంలో ఆహారాన్ని జీర్ణించుకోవాల్సి వస్తుంది. దీని వల్ల క్యాలరీలు పొట్ట చుట్టూ కొవ్వుగా మారతాయి. డిన్నర్ త్వరగా తినడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. రాత్రిపూట చిరుతిళ్లు తినడం తగ్గుతుంది. అలాగే రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి నిద్రకు అంతరాయాన్ని కలిగిస్తాయి. అదే రాత్రి త్వరగా తినడం వల్ల జీర్ణక్రియ పూర్తవుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గి సహజంగానే నిద్ర పడుతుంది. ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఇలా రాత్రిపూట త్వరగా తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మహిళల్లో పీఎంఎస్, మోనోపాజ్ మార్పులు, థైరాయిడ్ అసమతుల్యతలు తగ్గుతాయి. రాత్రి భోజనం త్వరగా చేయడం వల్ల ఇలా మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని కనుక అందరూ రాత్రి భోజనం త్వరగా తీసుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.