లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి (Mayawati) బీజేపీ, కాంగ్రెస్‌పై మండిపడ్డారు. దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని తారుమారు చేయవద్దని కోరారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గాలకు రిజర్వేషన్ హక్కులు కల్పించిన డా. బీఆర్ అంబేద్కర్ ప్రాముఖ్యతను దెబ్బతీయరాదని అన్నారు.
కాగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఈ వర్గాలలో ఆగ్రహాన్ని రేకెత్తించిందని తెలిపారు.
దేశంలో సామాజిక న్యాయానికి మూలస్తంభంగా ఉన్న రిజర్వేషన్ నిబంధనలను నిర్వీర్యం చేసి చివరికి రద్దు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు సంఘాలు బుధవారం పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు బీఎస్పీ మద్దతు ఇస్తోందని తెలిపారు. అయితే ఎలాంటి హింసాకాండకు తావులేకుండా క్రమశిక్షణతో, శాంతియుతంగా సమ్మెలో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలను ఆమె కోరారు.