న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : మెక్సికో సైన్యం చేతిలో ఆదివారం హతమైన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా సెర్వాంటెస్ అలియాస్ ఎల్ మెంచోను పట్టుకోవడానికి అధికారులు పెద్ద ఆపరేషనే నిర్వహించారు. అతడి ఆచూకీ కనుగొనడం కష్టంగా మారడంతో ఆయన ప్రియురాలిని ట్రాక్ చేస్తే అతడిని పట్టుకోవచ్చని భావించి అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నారు. మెక్సికన్ రక్షణ మంత్రి జనరల్ రికార్డో ట్రవిలా కథనం ప్రకారం.. మెంచో ప్రియురాలి నమ్మకస్తుడైన అనుచరునిపై మెక్సికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి.
ఎల్ మెంచో తన స్వరాష్ట్రం జలిస్కోలో ఉన్నాడు. శుక్రవారం తన అనుచరునితో అతని ప్రియురాలు తప్పాలాలో ఉన్న మెంచోను కలిసింది. దీంతో మెక్సికన్ సైన్యం అప్రమత్తమై అతనిపై దాడికి సిద్ధమైంది. మెంచో తన ప్రియురాలితో కలిసి తపల్లాలో అదే రోజు ఒక సమావేశానికి హాజరయ్యాడని, అతనితో రాత్రి గడిపిన తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందని, దీంతో అతని కచ్చితమైన లొకేషన్‌ను అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నిర్ధారించినట్టు రికార్డో చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మెంచో 8 మంది గన్మెన్లు హతమయ్యారని, గాయపడ్డ మెంచోను అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా మరణించినట్టు ఆయన చెప్పారు.