Tamim Iqbal : ప్రపంచ క్రికెట్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన బంగ్లాదేశ్ మాజీ సారథి తమీమ్ ఇక్బాల్ అనూహ్యంగా ఆస్పత్రి పాలయ్యాడు. సోమవారం అతడికి తీవ్రమైన గుండెపోటు(Heart Attack) రావడంతో అతడిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. దాంతో, అతడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు, బంగ్లా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తమీమ్ లైఫ్ సపోర్టింగ్ మీద ఉన్నాడని.. అతడిని మళ్లీ మామూలు మనిషిని చేసేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బీసీబీ తెలిపింది. అసలేం జరిగిందంటే.. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ సమయంలో తమీమ్ ఛాతిలో నొప్పితో బాధ పడ్డాడు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అతడిని గమనించిన సహచరులు వెంటనే బీసీబీని అప్రమత్తం చేశారు. మొదట హెలిక్యాప్టర్ ద్వారా అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాకపోవడంతో సిబ్బంది తమీమ్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
Tamim Iqbal suffered a heart attack during Dhaka Premier League match today. He’s on life support. Prayers for his recovery 🇧🇩🙏🏽🙏🏽
— Farid Khan (@_FaridKhan) March 24, 2025
అక్కడ ఈ మాజీ సారథి ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు లైఫ్ సపోర్టింగ్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. అయితే.. మెరుగైన వైద్యం కోసం తమీమ్‌ను ఢాకాకు తీసుకెళ్లాలని బీసీబీ భావిస్తోంది. కానీ.. అతడి ఆరోగ్యం దృష్ట్యా అది సాధ్యం కాదని.. కాస్త కోలుకున్నాక ఢాకాకు తరలించడం మంచిదని డాక్టర్లు సూచించారు. దాంతో, తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకోవాలని బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్‌కు గుర్తింపు తీసుకొచ్చిన ఆటగాళ్లలో తమీమ్ ముందువరుసలో ఉంటాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో జట్టుకు శుభారంభాలు ఇస్తూ.. బంగ్లా చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడీ మాజీ ఓపెనర్. గతేడాది జూలైలో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తమీమ్.. అప్పటి ప్రధాని షేక్ హసీనా చొరవతో యూటర్న్ తీసుకున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌తో వివాదం కారణంగా అతడు తిరిగి జట్టుతో కలిసేందుకు విముఖత చూపించాడు. ఈ క్రమంలోనే చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడేందుకు నిరాకరించిన తమీమ్.. టీ20 లీగ్స్‌పై దృష్టి సారించాడు.