హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): అక్కడెక్కడో పడుతున్న బాంబుల వర్షం.. మన వంటింట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న భీకరయుద్ధ ప్రభావం మన ఇంటిని తాకింది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ఇక్కడ గ్యాస్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరో 15 రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చుతుందని డీలర్లు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ నగరంలోనూ గ్యాస్ కొరత తీవ్ర కలకలం రేపుతున్నది. మొన్నటి దాకా గ్యాస్ బుక్ చేసిన రెండు రోజుల్లోనే ఇంటిముందు వాలేది. కానీ, బుక్ చేసి ఇప్పటికే పది రోజులు గడిచినా గ్యాస్ సిలిండర్ అందడం లేదని నగర వినియోగదారులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బుక్ చేసిన తరువాత నెల ఆగాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు, అలాంటి పరిస్థితి లేదని, గ్యాస్ సరఫరా సక్రమంగానే ఉన్నదని ఏజెన్సీలు వినియోగదారులకు సందేశాలు పంపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా గ్యాస్ కొరత దడ పుట్టిస్తున్నది.
ఇంకోవైపు, వాణిజ్య గ్యాస్ సైతం మంటలు రేపుతున్నది. హోటళ్ల నిర్వాహకులు పరిస్థితి సంక్లిష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ముంబై, బెంగళూరులో కొన్ని హోటల్స్ గ్యాస్ కొరత కారణంగా మూసివేశారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌లో సైతం మరో రెండు రోజుల్లో రాబోతున్నదని హోటల్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై గ్యాస్ డీలర్లను ఆరా తీయగా తమకు గ్యాస్ సిలిండర్ల లోడ్ రావడం ఆలస్యమవుతున్నదని చెప్తున్నారు. గతంలో ఇండెంట్ పెట్టగానే మరుసటి రోజు లోడ్ వచ్చేదని, కానీ ఇప్పుడు రెండు మూడు రోజులు వెయిటింగ్ చూపిస్తున్నదని చెప్తున్నారు. దీంతో వినియోగదారులకు గ్యాస్ డెలివరీ ఆలస్యమవుతున్నదని వివరిస్తున్నారు. గ్యాస్ నిల్వలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.3 కోట్ల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రతి నెలా 58 లక్షల నుంచి 60 లక్షల మంది గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో సుమారు 19.65 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ప్రతి నెలా 16 లక్షల వరకు బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న కొరత భయంతో బుకింగ్స్ 15-20% పెరిగాయని చెప్తున్నారు. డబుల్ సిలిండర్ ఉన్నవాళ్లు వెంటనే బుకింగ్‌లను మొదలుపెట్టారు. యుద్ధం కారణంతో రాబోయే రోజుల్లో కొరత మరింత తీవ్రమవుతుందనే ఆందోళనతో ముందు జాగ్రత్తగా బుకింగ్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్‌ను అధిక ధరలకు విక్రయించి డబ్బులు దండుకుంటున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
యుద్ధం కారణంగా ఆందోళన చెందుతున్న వినియోగదారులను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు మరింత భయపెడుతున్నాయి. ఇప్పటికే గృహ వినియోగ సిలిండర్ ధర రూ.60 పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నది. గ్యాస్ బుకింగ్ మధ్య గడువును 25 రోజులకు పెంచింది. కస్టమర్ ఈరోజు గ్యాస్ బుక్ చేసుకుంటే, మళ్లీ 25 రోజుల తర్వాతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు గ్యాస్ డెలివరీ సమయంలోనే ఓటీపీ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగాలకు ఉపయోగించే గ్యాస్ పక్కదారి పట్టకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
మరోవైపు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్‌ను దాదాపు మూసివేసింది. మొదటి ప్రాధాన్యం గృహ వినియోగ అవసరాలకు ఇవ్వాలని, కమర్షియల్‌కు పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హోటళ్లు, ఇతర ఫుడ్‌కు సంబంధించిన వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారికి దాదాపుగా గ్యాస్ డెలివరీని బంద్ చేయడంతో హోటళ్లు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరతతో పలు హోటళ్ల నిర్వాహకులు తమ ఔట్లెట్ సేవలను తగ్గించారు.
రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు సైతం జోరు తగ్గించారు. హోటళ్లు, పేయింగ్ గెస్ట్ వసతి గృహాలు, ప్రైవేట్ హాస్టళ్లపై సైతం ప్రభావం పడింది. గ్యాస్ కొరత తీరకపోతే ఈ సంస్థలన్నీ మూసివేసే పరిస్థితి నెలకొన్నది. హైదరాబాద్ నగరంలో 74 వేలకుపైగా హోటళ్లు, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయని హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. సరఫరా సుమారు 75% తగ్గిందని వివరించారు. సాధారణంగా హోటళ్లకు సాధారణ వంటగది కార్యకలాపాలు నిర్వహించాలంటే రోజుకు 15-20 సిలిండర్ల అవసరం ఉంటా యి.
నగరంలో నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు విక్రయాలు జరుగుతాయి. టీ స్టాల్ నుంచి స్టార్ హోటళ్ల వరకు నెలకు 4 లక్షల నుంచి 5.5 లక్షల సిలిండర్లు అవసరం. ఇండస్ట్రీలకు సుమా రు మరో 1.5 లక్షలు అదనంగా డిమాండ్ ఉన్నది. ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు రూ.140 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంటుందని గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్నాయి. రెండు రోజులుగా బల్క్ సరఫరా ఆగిపోవడంతో ఆందోళనలు రేకెత్తాయి.
గ్యాస్ సరఫరా లేకపోవడంతో ఫుడ్ ఇండస్ట్రీ పూర్తిగా మూతపడే పరిస్థితి వచ్చింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కేవలం ఒకరోజు ముందుగా ప్రకటించడం దారుణం. కనీసం వారం రోజుల ముందు తెలియజేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవాళ్లం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫుడ్ ఇండస్ట్రీ భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. తెలంగాణలో దాదాపు 40 నుంచి 50 వేల వరకు చిన్న, పెద్ద హోటళ్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌లోనే ఏడు వేలకు పైగా ఉన్నాయి.
ఇవి కాకుండా టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు దాదాపు 20 వేలకుపైగా ఉన్నాయి. వీటిపై లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఉన్నఫళంగా గ్యాస్ సరఫరాను నిలిపిస్తే ఇన్ని కుటుంబాల పరిస్థితి ఏమిటి? ముందస్తు ప్రణాళిక లేకుండా గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో కనీసం హోటల్ సిబ్బందికి కూడా భోజనం పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. నగరంలోని మూడువేలకుపైగా ఉన్న హోటల్స్‌లో ఉన్న టూరిస్టులకు ఆహారం ఎలా పెట్టాలో అర్థంకాని పరిస్థితి సృష్టించారు. కరోనా సమయంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదు. ప్రస్తుత పరిస్థితిని ఎలా పరిష్కరించుకోవాలో పాలుపోని సంకట స్థితిలోకి కేంద్రం నెట్టింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. లేదంటే తదుపరి కార్యాచరణ ఆలోచిస్తాం.
– ఎస్ వెంకట్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
పెట్రోలియం, డీజిల్, సీఎన్జీ ఇతర గ్యాస్ సరఫరాలో ఇప్పటికే కొరత ఏర్పడింది. యుద్ధ పరిస్థితుల కారణంగా వాటి ధరలు సైతం పెరుగుతాయని భావిస్తున్నారు. మహానగరంలో వాహనాల సంఖ్య 88 లక్షలు దాటిపోయింది. అందులో సుమారు 14.35 లక్షల వరకు కార్లు ఉండగా, 1.46 లక్షల ఆటోరిక్షాలు, 80 వేల క్యాబ్‌లు ఉన్నాయని అధికార లెకలు స్పష్టంచేస్తున్నాయి. మొత్తంమీద సుమారు మూడు నాలుగు లక్షల వాహనాలు సీఎన్జీ, ఆటో గ్యాస్, లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఆటోగ్యాస్, లిక్విడ్ గ్యాస్‌కు కొరత లేనప్పటికీ, సీఎన్జీ పూర్తిస్థాయిలో సరఫరా లేదు. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతిరోజూ 5,000 ఆటోలు, 1,000 వరకు కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్థ్యం నాలుగున్నర కిలోలు కాగా నాలుగు కిలలో వరకు, కార్ల సామర్థ్యం పది కిలోలకుగాను ఎనిమిది కిలోల వరకు గ్యాస్ నింపుతారు. ఒకో స్టేషన్‌కు ప్రతిరోజూ 6 వేల కిలోల వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. ఈ పరిస్థితిలో సీఎన్జీకి మరింత కొరత ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
